RIP |మాగంటికి నారా లోకేష్ దంపతుల నివాళి

హైదరాబాద్ : ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ,ఆయన సతీమణి బ్రాహ్మణి నేడు మరణించిన మాగంటి భౌతికాయానికి నివాళులర్పించారు. జూబ్లిహిల్స్ ఎమ్మెల్యే మాగంటి నివాసానికి వచ్చిన ఈ దంపతులు మాగంటి పార్ధీవ దేహంపై పుష్ప గుచ్చలు ఉంచి అంజలి ఘటించారు.

అనంతరం లోకేష్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి దిగ్భ్రాంతికి గురిచేసిందని, గుండెపోటుతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన అకాల మరణం పొందడం బాధాకరమని అన్నారు. తెలుగుదేశం పార్టీతోనే మాగంటి గోపీనాథ్ రాజకీయ ప్రస్థానం మొదలైందన్నారు. 1982లో తెలుగుదేశం పార్టీలో చేరిన ఆయన 1985లో హైదరాబాద్ నగర తెలుగు యువత అధ్యక్షుడిగా పనిచేశారని అన్నారు. 2014లో టీడీపీ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందారని.. ఎమ్మెల్యేగా వరుసగా మూడు సార్లు విజయం సాధించి నియోజకవర్గ అభివృద్ధి, ప్రజాసంక్షేమం కోసం ఆయన కృషి చేశారని కొనియాడారు. మాగంటి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తూ.. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని అన్నారు.

ప్రజల మనిషిగా మాగంటి నిలిచిపోతారు..

ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ప్రజల మనిషిగా నిలిచిపోతారని, మూడు సార్లు జూబ్లీహిల్స్ నియోజకవర్గంకు ఎమ్మెల్యేగా గెలుపొందడం ఆషామాషీ కాదని మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. అనారోగ్యంతో ఉన్నా ప్రజల కోసం పనిచేశారని, మంచి నాయకుడిని పార్టీ కోల్పోయిందని అన్నారు. జూబ్లిహిల్స్ నియోజకవర్గం అభివృద్ధికి పార్టీ తరపున కృషి చేస్తామని చెప్పారు. మాగంటి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని కోరుకుంటూ.. ఆయన కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని నామా నాగేశ్వరరావు అన్నారు.

కాగా కాంగ్రెస్ నేత అజహారుద్దీన్.. మాగంటి గోపీనాథ్ భౌతికకాయానికి నివాళులర్పించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో మాగంటిపై అజహారుద్దీన్ కాంగ్రెస్ అభ్యర్థిగా జూబ్లీహిల్స్‌లో పోటీ చేసి ఓడిపోయిన విషయం తెలిసిందే

మాగంటి నివాసం వద్ద ఆందోళన..

మాగంటి గోపీనాథ్ నివాసం వద్ద ఆయన అభిమానులు ఆందోళన చేపట్టారు. మాజీ సీఎం కేసీఆర్ వచ్చిన సమయంలో కాంగ్రెస్ నేత బాబా ఫసియుద్దీన్ డౌన్ డౌన్ అంటూ.. ఇటీవల ఆత్మహత్య చేసుకున్న సర్దార్ కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్ కార్యకర్తలు నినాదాలు చేశారు. మాగంటి మృతితో తమకు దిక్కెవరు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. బోరబండకు ఒక్కసారి వచ్చి వెళ్లాలంటూ సర్దార్ కుటుంబ సభ్యులు కేసీఆర్‌ను వేడుకున్నారు.

Leave a Reply