బందోబస్తు నడుమ మోత్కూర్ మున్సిపల్ కౌన్సిల్ సమావేశం
- ఎమ్మెల్యే సామెల్, కౌన్సిలర్ల మధ్య సయోధ్య కుదిరేనా..?
- కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక జరిగేనా..?
మోత్కూర్ (ఆంధ్రప్రభ): యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మున్సిపల్ కౌన్సిల్ సమావేశం బుధవారం మున్సిపల్ చైర్మన్ గడ్డం స్వప్న–సోమనర్సయ్య అధ్యక్షతన జరిగింది. తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సమావేశం నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా మోత్కూర్, ఆత్మకూరు, అడ్డగూడూరు మండలాలకు చెందిన ఎస్‌ఐలు, ఏఎస్‌ఐలతో పాటు 20 మంది పోలీసు సిబ్బంది, 10 మంది స్పెషల్ పార్టీ పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే సామేల్ సమావేశానికి హాజరయ్యేలోపే కౌన్సిలర్లు సమావేశ మందిరంలో తమ స్థానాల్లో కూర్చొన్నారు.
మోత్కూర్ మున్సిపాలిటీలో రూ.15 కోట్ల సింగిల్ టెండర్‌ను ఇప్పటికే మెజారిటీ కౌన్సిలర్ల తీర్మానం మేరకు రెండుసార్లు రద్దు చేయడంతో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. రూ.15 కోట్ల టెండర్, కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక, రూ.1.27 కోట్ల నిల్వ నిధుల వినియోగంపై ఎమ్మెల్యే, కౌన్సిలర్ల మధ్య భిన్నాభిప్రాయాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారన్న అంశంపై స్థానిక ప్రజలు, రాజకీయ పార్టీల నాయకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
