గురు పౌర్ణమి వేడుకల్లో భక్తుల సందడి

సాయినాథుడికి ప్రత్యేక అభిషేకాలు.. భక్తులకు తీర్థ ప్రసాదాల పంపిణీ

తొర్రూరు టౌన్, ఆంధ్రప్రభ: డివిజన్ కేంద్రంలోని ఓంకార నిలయ ప్రాంగణంలో ఉన్న సాయి సంతోషి మందిరంలో గురు పౌర్ణమి సందర్భంగా బుధవారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయాన్ని ప్రత్యేకంగా అలంకరించి భక్తుల కోసం ఏర్పాట్లు చేశారు.

ఉదయం సాయినాథుడికి పలు రకాల పండ్లు, పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచామృతాలతో మూలవిరాట్టుకు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. ఆలయ అర్చకులు రేణిగుంట్ల శివ, వెన్నప్ప సంతోష్ శర్మ, క్రాంతి ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో సాగాయి.

అనంతరం భక్తులతో సామూహిక గోత్రనామార్చనలు నిర్వహించి, హారతి, నీరాజన కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం ఆలయానికి విచ్చేసిన భక్తులకు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమాన్ని మందిరం నిర్వాహకులు తమ్మెర లక్ష్మీనరసింహారావు, శారద, మణికుమార్, గుమ్మడవెల్లి శ్రీనివాస్, చిదిరాల శ్రీనివాస్, గోపరపు చంద్రమౌళి, డి. నాగశివప్రసాద్ నిర్వహించారు. కార్యక్రమంలో ఇమ్మడి రాంబాబు, తల్లాడ హిరాధర్, కేశెట్టి ప్రవీణ్, గుండా దేవేందర్‌తో పాటు మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.