కనీస వేతనాల అమలుకు సీఐటీయూ బైక్ ర్యాలీ

పుట్టపర్తి, ఆంధ్రప్రభ: కార్మికులకు చట్టబద్ధమైన కనీస వేతనాలు అమలు చేయాలని, కార్మిక హక్కులను పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో జూలై 30, 31 తేదీల్లో పుట్టపర్తి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిర్వహించనున్న రెండు రోజుల ధర్నాకు మద్దతుగా బుధవారం పట్టణంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. గణేష్ సర్కిల్‌ నుంచి ప్రారంభమైన ర్యాలీ ప్రధాన వీధుల మీదుగా చిత్రావతి బ్రిడ్జి వరకు సాగింది. వివిధ రంగాలకు చెందిన కార్మికులు పెద్ద సంఖ్యలో ద్విచక్ర వాహనాలతో పాల్గొని కనీస వేతనాల అమలు, కార్మికుల సమస్యల పరిష్కారం కోరుతూ నినాదాలు చేశారు. ధర్నా ఉద్దేశాలను ప్రజలకు వివరిస్తూ విస్తృత ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా సీఐటీయూ శ్రీ సత్యసాయి జిల్లా ప్రధాన కార్యదర్శి జి.ఎల్. నరసింహులు మాట్లాడుతూ రాష్ట్రంలోని అనేక రంగాల కార్మికులు ఇప్పటికీ చట్టబద్ధమైన కనీస వేతనాలు పొందకుండా పనిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతుండటంతో కార్మిక కుటుంబాల జీవనం భారంగా మారిందన్నారు. ప్రభుత్వం వెంటనే కనీస వేతనాల చట్టాన్ని కఠినంగా అమలు చేసి అన్ని రంగాల కార్మికులకు న్యాయమైన వేతనాలు అందేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

జూలై 30, 31 తేదీల్లో పుట్టపర్తి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిర్వహించే ధర్నాలో నిర్మాణ, మున్సిపల్, పారిశుధ్య, హమాలీ, భవన నిర్మాణ, అసంఘటిత రంగాల కార్మికులు, మహిళా కార్మికులు, కార్మిక సంఘాల నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని ఉద్యమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ర్యాలీలో సీఐటీయూ జిల్లా కోశాధికారి లక్ష్మీనారాయణ, జిల్లా కార్యదర్శి పైపల్లి గంగాధర్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ఎస్. వెంకటేష్, ఆఫీస్ బేరర్ సిద్ధూ, మున్సిపల్ యూనియన్ నాయకులు నాగార్జున, రామయ్య, నరసింహులు, గోవిందు, గౌస్ లాజా, ఇంజినీరింగ్ సెక్షన్ అధ్యక్షుడు రమణ, కార్యదర్శి బెస్త గంగాధర్, రామకృష్ణ, రమేష్, కె. రమణ, పి. రమణ, తిరుపాల్, వెంకటేష్, కుల్లాయిరెడ్డి తదితరులు, స్థానిక మున్సిపల్ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.