హైదరాబాద్ : తెలంగాణ కేబినెట్‌లో ముగ్గురు మంత్రులు చేరారు. ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు మంత్రులుగా ఆదివారం రాజ్‌భవన్‌లో మధ్యాహ్నం 12.19 గంటలకు ప్రమాణస్వీకారం చేశారు. సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యం ఇస్తూ, సీఎం రేవంత్ తన టీమ్‌ను విస్తరిస్తున్నారు. ప్రమాణ స్వీకారం చేసిన మంత్రుల్లో అడ్లూరి లక్ష్మణ్, గడ్డం వివేక్, వాకిటి శ్రీహరి ఉన్నారు. ఈ ముగ్గురు ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ అభినందనలు తెలిపారు.
ఇదిలా ఉండగా, తెలంగాణ కేబినెట్ విస్తరణలో సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యత కల్పించారు సీఎం రేవంత్‌రెడ్డి. ఎస్సీ మాల, ఎస్సీ మాదిగ, బీసీ ముదిరాజ్ సామాజిక వర్గాల నుంచి కేబినెట్‌లోకి గడ్డం వివేక్, అడ్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహరికి చోటు కల్పించారు. వివేక్, లక్ష్మణ్ చేరికతో కేబినెట్‌లో దళిత మంత్రుల సంఖ్య నాలుగుకి చేరుతుంది.
కాంగ్రెస్ నుంచి గెలిచిన ఏడుగురు బీసీల్లో ముగ్గురికి మంత్రి పదవులు దక్కినట్లయింది.పొన్నం ప్రభాకర్, కొండా సురేఖతోపాటు కేబినెట్‌లోకి వాకిటి శ్రీహరి కూడా చేరారు.
ఇక శాసన సభలో ఉప సభాపతి బాధ్యతలు రామచంద్రు నాయక్ స్వీకరించారు. ఎస్టీ లంబాడాలకు డిప్యూటీ స్పీకర్ పదవి లభిస్తోంది. డోర్నకల్ నుంచి తొలిసారి గెలిచిన రామచంద్రునాయక్‌కి డిప్యూటీ స్పీకర్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఎస్టీ ఆదివాసీ నుంచి ఇప్పటికే మంత్రిగా సీతక్క కేబినెట్‌లో ఉన్నారు. అయితే ఈసారి విస్తరణలో రెడ్లకు చోటు దక్కలేదు.
వాకిటి శ్రీహరి నేపథ్యం:
వాకిటి శ్రీహరి ముదిరాజ్ ప్రస్తుతం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని మక్తల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. తొలినాళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీతోనే రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 2001 నుండి 2006 వరకు మక్తల్ గ్రామ సర్పంచ్‌గా పని చేశారు. 2014 నుండి 2018 వరకు మక్తల్ జెడ్పీటీసీగా ఉన్నారు. 2014 నుండి 2018 వరకు కాంగ్రెస్ పార్టీ నారాయణపేట జిల్లా ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. ఆ తర్వాత జిల్లా అధ్యక్షుడు కూడా అయ్యారు. మక్తల్ నుంచి విజయం..2023లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వాకిటి శ్రీహరి ముదిరాజ్ మక్తల్ నుంచి గెలిచారు. 17525 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. బీసీల కోటాలో కేబినెట్ లో చోటు దక్కించుకున్నారు
వివేక్ ప్రస్థానం:
వివేక్ పూర్తి పేరు.. గడ్డం వివేక్ వెంకటస్వామి. ఇయన కాంగ్రెస్ సీనియర్ నేత వెంకటస్వామి కుమారుడు.బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో పాఠశాల విద్యను చదివారు. ఉస్మానియా వైద్య కళాశాల నుంచి వైద్య విద్యను పూర్తి చేశారు. 2009లో పెద్దపల్లి నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కీలకంగా వ్యవహరించారు. రాష్ట్ర సాధన కోసం కాంగ్రెస్ పార్టీ తరపున పార్లమెంట్ లో పోరాడారు.
ఉద్యమ సమయంలో కాంగ్రెస్ పార్టీని వీడిని వివేక్.. 2013లో బీఆర్ఎస్ (టీఆర్‌ఎస్)లో చేరారు. కొద్దిరోజులకే మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2014లో పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2016లో మళ్లీ టీఆర్‌ఎస్‌లో చేరిన వివేక్.. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా నియమితులయ్యారు.
చెన్నూరు నుంచి ఎమ్మెల్యేగా గెలుపు..
2019లో టీఆర్ఎస్ నుంచి బయటికి వచ్చిన వివేక్.. బీజేపీలో చేరారు. భారతీయ జనతా పార్టీ కేంద్ర కార్యవర్గ సభ్యుడిగా నియమితుల్యారు. బీజేపీని వీడిని వివేక్.. మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరారు. 2023లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో చెన్నూరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. వివేక్ కుమారుడైన గడ్డం వంశీ.. ప్రస్తుతం పెద్దపల్లి ఎంపీ ( కాంగ్రెస్)గా ఉన్నారు.
అడ్లూరి లక్ష్మణ్ నేపథ్యం:
అడ్లూరి లక్ష్మణ్ ప్రస్తుతం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ధర్మపురి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 1982 నుండి 85 వరకు గోదావరిఖని జూనియర్ కళాశాల ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడిగా పని చేశారు. 1986 నుండి 94 వరకు ఎన్‌ఎస్‌యూఐ కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా, 1996 నుండి 2001 వరకు ఏపీ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు.
2006లో ధర్మారం (ఎస్సీ) రిజర్వుడ్ స్థానం నుంచి జడ్పీటీసీగా పోటీ చేసి గెలిచారు. 1999లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో మేడారం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. అడ్లూరి లక్ష్మణ్ కుమార్ 2010 నుండి 2012 వరకు కరీంనగర్ జడ్పీ ఛైర్మన్‌గా పని చేశారు
.అడ్లూరి రాజకీయ ప్రస్థానం
2009లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో, 2010లో జరిగిన ఉప ఎన్నికల్లో ధర్మపురి నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయారు. 2014, 2018లో ధర్మపురి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2013 నుంచి 14 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్‌గా పని చేశారు. ఆ తరువాత జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నియమితులయ్యారు.
2023లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ధర్మపురి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ తన సమీప బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ పై 22,039 ఓట్ల మెజారిటీతో గెలిచారు. తొలిసారిగా అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. లక్ష్మణ్ కుమార్ ను 2023 డిసెంబర్ 15న ప్రభుత్వ విప్‌గా ప్రభుత్వం నియమించింది. తాజాగా ఆయనకు కేబినెట్ లో బెర్త్ కల్పించింది.