సీడ్ యాక్సిస్ రోడ్డు పనులు వేగవంతం చేయాలి
- మంత్రి పొంగూరు నారాయణ
గుంటూరు, ఆంధ్రప్రభ: రాజధాని అమరావతిలో నిర్మాణంలో ఉన్న సీడ్ యాక్సిస్ రోడ్డును పాత గుంటూరు జాతీయ రహదారితో అనుసంధానించే పనులను పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ పరిశీలించారు. నిర్మాణ పనుల పురోగతిని అధికారులతో సమీక్షించి, పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తయితే విజయవాడ, మంగళగిరి ప్రాంతాల నుంచి అమరావతికి నేరుగా, సులభమైన రాకపోకలు సాధ్యమవుతాయని తెలిపారు. ఈ మార్గంలో బకింగ్‌హామ్ కాలువ, కొండవీటి వాగుపై నిర్మిస్తున్న రెండు ఉక్కు వంతెనల పనులు తుది దశకు చేరుకున్నాయని వెల్లడించారు.
వంతెనల నిర్మాణం పూర్తయ్యేలోపు మిగిలిన రోడ్డు పనులను కూడా పూర్తి చేసి, మొత్తం కారిడార్‌ను వీలైనంత త్వరగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే రాజధాని అమరావతికి అనుసంధానం మరింత బలోపేతం కావడంతో పాటు రవాణా సౌకర్యాలు మెరుగుపడతాయని ఆయన పేర్కొన్నారు.
