democracy|ప్రజాస్వామ్యానికి హక్కులే పునాదులు

- డాక్టర్ వేణు గోపాల్, సీఈఓ సెట్కూరు
democracy|ప్రజాస్వామ్యానికి హక్కులే పునాదులువెల్దుర్తి, ఆంధ్రప్రభ : వెల్దుర్తిలో సెట్కూరు సీఈఓ డాక్టర్ వేణు గోపాల్ ఆధ్వర్యంలో బుధవారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గురుకుల బాలికల పాఠశాలలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఈఓ మాట్లాడుతూ.. దేశంలో నివసించే అన్ని మతాల ప్రజల మధ్య ఐక్యత, సమానత్వం నెలకొనేలా, ఎటువంటి వివక్షకు తావులేకుండా ప్రతి పౌరుడికి హక్కులు కల్పించే విధంగా భారత రాజ్యాంగాన్ని రూపకల్పన చేశారని పేర్కొన్నారు.
భారత రాజ్యాంగ ప్రవేశిక, దేశ పౌరులందరికీ న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం ప్రసాదించడంతో పాటు, వారి మధ్య సోదరభావాన్ని ప్రోత్సహించే లక్ష్యాలను స్పష్టంగా ప్రతిపాదిస్తుందని ఆయన తెలిపారు. ప్రజాస్వామ్య వ్యవస్థ బలపడటానికి ప్రతి పౌరుడికి లభించే హక్కులే పునాదిగా నిలుస్తాయని, నేటి భారతదేశంలో అన్ని వర్గాల ప్రజలకు వివిధ రంగాల్లో లభిస్తున్న సమాన అవకాశాలన్నీ రాజ్యాంగ మహోన్నతతకు నిదర్శనమని వ్యాఖ్యానించారు. తహసీల్దార్ చంద్రశేఖర్ వర్మ మాట్లాడుతూ.. భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన జ్ఞాపకార్థంగా ప్రతి సంవత్సరం నవంబర్ 26న దేశవ్యాప్తంగా రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహిస్తారని ఆయన విద్యార్థులకు వివరించారు.

1949 నవంబర్ 26న భారత రాజ్యాంగ సభ రాజ్యాంగాన్ని ఆమోదించగా, 1950 జనవరి 26న అది అమలులోకి వచ్చి భారతదేశాన్ని సర్వసత్తాక, లౌకిక, ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా ప్రకటించినట్లు చెప్పారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 125వ జయంతి సంవత్సరం సందర్భంగా, 2015లో కేంద్ర ప్రభుత్వం నవంబర్ 26ను అధికారికంగా ‘రాజ్యాంగ దినోత్సవం’గా ప్రకటించిందని ఆయన గుర్తు చేశారు. ఆ సంవత్సరం నుండి ప్రతి ఏడాది ఈ దినాన్ని రాజ్యాంగ విలువలను స్మరించుకునే రోజు గా దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నామని తెలిపారు.
కళాశాల ప్రిన్సిపాల్ లక్ష్మీ ప్రసూనా మాట్లాడుతూ.. రాజ్యాంగంపై అవగాహన పెంపొందించేందుకు విద్యార్థుల కోసం ప్రసంగం, వ్యాసరచన , పెయింటింగ్, క్విజ్ పోటీలను ను నిర్వహించామని చెప్పారు. ఈ పోటీల్లో విజేతలైన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేసి వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో సెట్కూరు సూపరింటెండెంట్ శ్యామ్ బాబు, అధ్యాపకులు వరలక్ష్మి, అరుణ పాల్గొన్నారు.
