ప్రజా ప్రభుత్వంలో విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలకు పెద్దపీట
సంక్షేమ పథకాలతో కాంగ్రెస్ ప్రజలకు అండగా నిలుస్తోంది : ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు
మంచిర్యాల, ఆంధ్రప్రభ : ప్రజా ప్రభుత్వంలో విద్య, వైద్యం, ఉపాధి, వ్యవసాయ రంగాలకు పెద్దపీట వేస్తూ రాష్ట్ర ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు అన్నారు.
తెలంగాణ ప్రభుత్వం తలసేమియా, సికిల్ సెల్ ఎనీమియా బాధితులకు ఆగస్టు 15 నుంచి నెలవారీ సామాజిక భద్రత పింఛన్లు అందించనున్న సందర్భంగా సోమవారం తలసేమియా–సికిల్ సెల్ వెల్ఫేర్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీనివాస్ ఆధ్వర్యంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఐబీ చౌరస్తా వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని అన్నారు. ఇందిరమ్మ కలలు కన్న “గరీబ్ హటావో” నినాదానికి అనుగుణంగా ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తోందని తెలిపారు.
మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలు చిన్న, మధ్య తరహా వ్యాపారాలు ప్రారంభించి ఆర్థికంగా స్వావలంబన సాధిస్తున్నారని పేర్కొన్నారు. అలాగే తలసేమియా, సికిల్ సెల్ వ్యాధులతో బాధపడుతున్న వారు జీవితాంతం చికిత్స పొందాల్సిన పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని వారికి నెలవారీ పింఛన్ అందించే నిర్ణయం రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది బాధితులకు ఊరట కలిగిస్తుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య, కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షుడు, కార్పొరేటర్ తూముల నరేష్, మంచిర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ రామగిరి బానేష్, కార్పొరేటర్లు, నాయకులు, రెడ్ క్రాస్ అసోసియేషన్ సభ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
