Regonda | విత్తన దుకాణాలపై టాస్క్‌ఫోర్స్ ఆకస్మిక తనిఖీలు

Regonda | విత్తన దుకాణాలపై టాస్క్‌ఫోర్స్ ఆకస్మిక తనిఖీలు

  • రైతులకు కీలక సూచనలు

రేగొండ, ఆంధ్రప్రభ : రేగొండ మండలంలోని విత్తన, ఎరువుల దుకాణాలను టాస్క్‌ఫోర్స్ సభ్యులు శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు అందుతున్నాయా, నిబంధనల ప్రకారం వ్యాపారం జరుగుతోందా అనే అంశాలను అధికారులు పరిశీలించారు.

ఈ సందర్భంగా దుకాణాల్లోని స్టాక్ రిజిస్టర్లు, బిల్ బుక్కులు, విత్తనాల ఇన్వాయిసులను తనిఖీ చేశారు. రైతులు విత్తనాలు కొనుగోలు చేసినప్పుడు తప్పనిసరిగా లాట్ నంబర్‌తో కూడిన రసీదు ఇవ్వాలని, ఆ రసీదులను పంట కాలం పూర్తయ్యే వరకు భద్రపరుచుకోవాలని దుకాణ యజమానులకు సూచించారు.

అలాగే రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ లూజ్ పత్తి విత్తనాలు లేదా బీటీ-3 (BT-3) పత్తి విత్తనాలు వినియోగించవద్దని అధికారులు హెచ్చరించారు. గ్రామాల్లో తిరుగుతూ అక్రమంగా విత్తనాలు విక్రయించే వ్యక్తుల గురించి వెంటనే పోలీసులకు లేదా వ్యవసాయ శాఖ అధికారులకు సమాచారం అందించాలని కోరారు.

రైతులు కేవలం అధీకృత లైసెన్స్ కలిగిన డీలర్ల వద్ద మాత్రమే విత్తనాలు కొనుగోలు చేయాలని సూచించారు. అలాగే వర్షాలు పూర్తిస్థాయిలో కురిసే వరకు పత్తి సాగులో తొందరపడవద్దని, కనీసం 70 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైన తర్వాతే పత్తి విత్తనాలు విత్తుకోవాలని మండల వ్యవసాయ అధికారి రైతులకు సూచించారు.

ఈ తనిఖీల్లో టాస్క్‌ఫోర్స్ సభ్యులు, మండల వ్యవసాయ అధికారి పెద్ది వాసుదేవరెడ్డి, తహసీల్దార్ శ్వేతారావు, స్థానిక ఎస్సై సుధాకర్ పాల్గొన్నారు.