బహుజనులు తమ సత్తాను చాటాలి..

బహుజనులు తమ సత్తాను చాటాలి..

  • బీసీలు రాజ్యాధికారం కోసం ఉద్యమించాలి….
  • బీసీ రాజ్యాధికార వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు ఐతవోని రాఘవేందర్ గౌడ్

స్టేషన్ ఘన్ పూర్, ఆంధ్రప్రభ : బడుగు,బలహీన వర్గాలైన బిసి, ఎస్సి,ఎస్టి మైనారిటీ, అగ్రవర్ణ పేదలు ఐక్యమత్యంతో ఉద్యమిస్తే రెండేళ్లలో బీసీ రాజ్యం రావడం తద్యమని బీసీ రాజ్యాధికార వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు ఐతవోని రాఘవేందర్ గౌడ్( రాఘవన్న) పిలుపునిచ్చారు. శనివారం స్టేషన్ ఘన్ పూర్ మున్సి పాలిటీ పరిధిలోని చాగల్లు లో బీసీ రాజ్యాధికార వేదిక పాదయాత్ర అట్టహాసంగా కొనసాగింది. వివిధ పార్టీల నాయకులు,యువత, ప్రజలు పాదయాత్ర చేపడుతున్న రాఘవన్నకు తిలకం దిద్ది ఘన స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా బస్టాండ్ ఆవరణలో 8 వ వార్డు కౌన్సిలర్ పొన్నం రాజేష్ అధ్యక్షత నిర్వహించిన సమావేశంలో రాఘవన్న మాట్లాడారు. మన బతుకులు మారాలన్నా, నిరుద్యోగ సమస్య అంతం కావాలన్నా, ప్రభుత్వ విద్యా, వైద్యం మెరుగుపడాలన్నా బీసీ రాజ్యం రావాలని తెలిపారు. 8 దశాబ్దాలుగా మన సమస్యలపై చెప్పులు అరి గేలా తిరిగిన అగ్రవర్ణ పాలకులు పెడచెవిన పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ జనాభాలో 95శాతం ఉన్న మనం ఎందుకు అడుక్కోవాలని ప్రశ్నించారు.

రిజర్వేషన్లు తెచ్చుకోవడం, బీసీ నిధులు సాధించుకోవడం,సబ్ ప్లాన్ ఏర్పాటు చేసుకోవడం మన చేతిలో లేదని, కానీ బీసీ రాజ్యాధికారం సాధించుకోవడం మన చేతుల్లోనే ఉందని గుర్తు చేశారు. బీసీలంతా ఐక్యంగా ముందుకు కదిలి రెండేళ్లలో బీసీ రాజ్యాన్ని సాధించుకోవాలని కోరారు. బిసి రాజ్యాధికారమే లక్ష్యంగా పాదయాత్ర చేస్తున్నామని తెలిపారు. నాలుగు రోజు చేపట్టిన ఈ పాద యాత్రకు గ్రామ, గ్రామాన ప్రజలు అందరిస్తున్నారు.ఈ కార్యక్రమంలో బీసీ రాజ్యాధికార సమితి జనగామ జిల్లా కార్యదర్శి చింతకింది కృష్ణ మూర్తి, కౌన్సిలర్ పొన్నరాజేష్, సీనియర్ నాయకులు చేపూరి ప్రభాకర్, పాదయాత్ర బృందం సభ్యులు డాక్టర్ విద్యా రాణి, లలిత, శివ, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply