రైతు బజార్లలో రూ.52కే బీపీటీ స్టీమ్ రైస్: ఎమ్మెల్యే బొండా ఉమా

పాయకాపురం, ఆంధ్రప్రభ : ప్రజలకు నాణ్యమైన బీపీటీ స్టీమ్ రైస్‌ను కేవలం కిలో రూ.52కే రైతు బజార్లలో ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిందని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బొండా ఉమామహేశ్వరరావు తెలిపారు. పాయకాపురం రైతు బజార్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక బీపీటీ స్టీమ్ రైస్ కౌంటర్‌ను సోమవారం ఆయన లాంఛనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా నెలకొన్న యుద్ధ వాతావరణం, అంతర్జాతీయ పరిస్థితులు, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల కారణంగా బహిరంగ మార్కెట్‌లో బీపీటీ స్టీమ్ రైస్ ధర కిలోకు రూ.64 నుంచి రూ.65 వరకు చేరిందన్నారు. ఈ నేపథ్యంలో ప్రజలపై ఆర్థిక భారం తగ్గించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుని రైతు బజార్ల ద్వారా తక్కువ ధరకు బియ్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చిందని తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా 150 రైతు బజార్లు, 500 రైస్‌మిల్ అవుట్‌లెట్లలో బీపీటీ స్టీమ్ రైస్ విక్రయాలను సోమవారం నుంచి ప్రారంభించినట్లు చెప్పారు. గత రెండేళ్లుగా రైతు బజార్ల నిర్వహణను మరింత బలోపేతం చేస్తూ, నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించేందుకు ప్రభుత్వం పలు చర్యలు చేపట్టిందన్నారు.

రైతు బజార్లను ప్రజలకు మరింత ఉపయోగకరంగా తీర్చిదిద్దుతూ, నాణ్యమైన ఆహార ధాన్యాలను అందుబాటు ధరలకు అందించే దిశగా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని పేర్కొన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని రైతు బజార్లలో ప్రత్యేక రైస్ కౌంటర్ల ఏర్పాటు ద్వారా సామాన్య, మధ్యతరగతి కుటుంబాలకు ఎంతో ఉపశమనం కలుగుతుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో సివిల్ సప్లైస్ అధికారులు లక్ష్మణ్, ఈవో కిరణ్, టీడీపీ 62వ డివిజన్ ఇన్‌చార్జి పైడి శ్రీను తులసి, అధ్యక్షుడు జలకం రాజారావు, జూలూరు సాయి, వరలక్ష్మి, బుగతా రవి, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.