ప్రపంచ తెలుగు సాహిత్య మహాసభల్లో ఇమ్మడి రాంబాబుకు అరుదైన గౌరవం

ప్రపంచ తెలుగు సాహిత్య మహాసభల్లో ఇమ్మడి రాంబాబుకు అరుదైన గౌరవం

తొర్రూరు టౌన్, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజమండ్రిలోని గోదావరి గ్లోబల్ యూనివర్సిటీలో చైతన్య సరస్వతి శ్రీశ్రీ కళావేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన ఏడవ ప్రపంచ తెలుగు సాహిత్య మహాసభల్లో తొర్రూరు పట్టణానికి చెందిన ప్రముఖ సాహితీవేత్త ఇమ్మడి రాంబాబుకు విశిష్ట సత్కారం లభించింది. రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న ఈ మహాసభల్లో శనివారం తెలుగు భాష, సంస్కృతి, సాహిత్యం, కళలు, సంప్రదాయాలపై పలు కార్యక్రమాలు నిర్వహించారు.

సాహిత్య రంగంలో విశేష సేవలు అందించి అనేక పురస్కారాలు, అవార్డులు అందుకున్న ఇమ్మడి రాంబాబు ఈ మహాసభల్లో నిర్వహించిన పర్యావరణ పరిరక్షణ అంశంపై జరిగిన సాహిత్య గోష్టిలో పాల్గొని తన కవితను వినిపించారు. తన రచనకు, సాహిత్య సేవలకు గుర్తింపుగా ఈ గౌరవం లభించడం ఆనందంగా ఉందని ఆయన తెలిపారు.

ఈ సందర్భంగా గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ చైర్మన్ కేవీవీ సత్యనారాయణ (చైతన్య) రాజు, శ్రీశ్రీ కళావేదిక వ్యవస్థాపకులు కత్తిమండ ప్రతాప్లు రాంబాబును శాలువా, ప్రశంసాపత్రంతో ఘనంగా సత్కరించారు. తెలుగు భాష, సాహిత్యం అభివృద్ధికి కృషి చేస్తున్న రచయితలు, కవులు, కళాకారులను ఎలాంటి రుసుము లేకుండా ప్రోత్సహిస్తూ వేదిక గుర్తింపు కల్పిస్తోందని రాంబాబు పేర్కొన్నారు.

ఈ మహాసభల్లో తెలుగు విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ముసుగు శ్రీనివాస్, ఈనాడు సాహిత్య పేజీ నిర్వాహకులు ఎర్రప్రగడ, తెలుగు విశ్వవిద్యాలయానికి చెందిన టి. గౌరీశంకర్, రుడా చైర్మన్ గండి కృష్ణ, జాతీయ అధ్యక్షురాలు ఈశ్వరి భూషణ్, కార్యక్రమ నిర్వాహకులు డాక్టర్ పార్థసారథితో పాటు దేశవ్యాప్తంగా సుమారు వెయ్యి మంది కవులు, రచయితలు పాల్గొన్నారు.