Rally : కూట‌మి కుట్ర‌ల‌ను గుర్తించండి..

ప్రైవేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా పుత్తూరులో రోజా నేతృత్వంలో ర్యాలీ

పుత్తూరు, నవంబర్‌ 12 (ఆంధ్రప్రభ): పేద ప్రజలకు అందాల్సిన విద్యా–వైద్య సేవలను ప్రైవేటీకరించే కూటమి ప్రభుత్వ విధానాలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ, నగరి నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో బుధవారం పుత్తూరులో భారీ ప్రజా ఉద్యమ ర్యాలీ ఘనంగా నిర్వహించబడింది. మాజీ మంత్రి ఆర్.కే. రోజా సూచనలతో, పార్టీ ప్రజాప్రతినిధులు, సేవా సంఘాల ప్రతినిధులు, మేధావులు, అనుబంధ విభాగాల నాయకులు, అలాగే వడమాలపేట, పుత్తూరు, నగరి, నిండ్ర, విజయపురం మండలాల వైఎస్సార్సీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్వేటినగరం రోడ్డులోని ఆంజనేయ స్వామి ఆలయం వద్ద ప్రారంభమైన ర్యాలీ బజారు వీధి, తోపు వీధి మీదుగా అంబేద్కర్ సర్కిల్ వరకు ఉత్సాహంగా సాగింది. ఈ సందర్భంగా మాజీ మంత్రి రోజా పుత్తూరు–కార్వేటినగరం కూడ‌లిలోని డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి గజమాల వేసి నివాళులర్పించారు. అనంతరం “జై జగన్” అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు.

రోజా మాట్లాడుతూ..
ప్రజల సంక్షేమం కోసం ఉచిత విద్య, వైద్యానికి కట్టుబడి పనిచేసిన వైసీపీ నాయకుడు వై.ఎస్. జగన్మోహనరెడ్డి సంకల్పాన్ని నిలబెట్టడమే ఈ ర్యాలీ ఉద్దేశమని తెలిపారు. పేదల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రారంభించిన పథకాలను నిలువరించేందుకు కూటమి చేస్తున్న కుట్రలను ప్రజలు తప్పక గుర్తించాలన్నారు.

Leave a Reply