జలమయమైన రాఘవాపూర్ ప్రభుత్వ పాఠశాల
ఆవరణలో నిలిచిన వరద నీరు..
విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఇబ్బందులు
పెద్దపల్లి రూరల్, ఆంధ్రప్రభ: పెద్దపల్లి మండలం రాఘవాపూర్ ప్రభుత్వ పాఠశాల ఆవరణ భారీ వర్షాల కారణంగా జలమయమైంది. పాఠశాల మైదానంలో పెద్ద ఎత్తున వరద నీరు చేరి కుంటను తలపించేలా మారింది.
పాఠశాలకు వచ్చి వెళ్లే విద్యార్థులు, ఉపాధ్యాయులు వరద నీటి కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నీటిలోనే రాకపోకలు సాగించాల్సిన పరిస్థితి నెలకొంది.
వర్షాకాలంలో ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా పాఠశాల ఆవరణలో వర్షపు నీరు నిల్వకుండా తగిన డ్రైనేజీ ఏర్పాట్లు చేయాలని గ్రామస్థులు అధికారులను కోరుతున్నారు.
