ఆరుతడి పంటల సాగుపై రైతులకు అవగాహన
ఎల్‌నినో ప్రభావం దృష్ట్యా ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని అధికారుల సూచన
చౌటుప్పల్, ఆంధ్రప్రభ: ఆరుతడి పంటల సాగుతోనే రైతులకు ప్రయోజనం ఉంటుందని చౌటుప్పల్ మండల వ్యవసాయ అధికారి ముత్యాల నాగరాజు తెలిపారు. మండలంలోని పంతంగి గ్రామ రైతు వేదికలో బుధవారం ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏవో ముత్యాల నాగరాజు మాట్లాడుతూ, ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందున రైతులు నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని ఆరుతడి పంటలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. తక్కువ నీటితో సాగయ్యే కందులు, మినుములు, కూరగాయలు వంటి స్వల్పకాలిక ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని కోరారు.
రైతులు సకాలంలో విత్తనాలు వేసుకుని, వ్యవసాయ శాఖ అధికారుల సూచనల మేరకు పంటల సాగు చేపట్టాలని తెలిపారు.
అనంతరం మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీఓ) కె. శ్రీలత మాట్లాడుతూ, ప్రతి రైతు ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసుకుని వర్షపు నీటిని భూమిలోకి ఇంకించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. దీనివల్ల భూగర్భ జలాలు పెరిగి పంటలకు ఉపయోగపడతాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పంతంగి గ్రామ సర్పంచ్ కాకి శ్రీలత సుందర్, గుండ్లబావి గ్రామ సర్పంచ్ నందగిరి వెంకటేష్, ఉప సర్పంచ్ బోయ సదానందం, సత్యనారాయణ, ఏపీఎం ఈశ్వర్, ఏఈఓలు వెన్నెల, వీణ కుమారి, లక్ష్మణ్, కృష్ణ, పంచాయతీ కార్యదర్శి పద్మజ, స్థానిక రైతులు పాల్గొన్నారు.
మండలంలోని మహమ్మదాబాద్ గ్రామ రైతు వేదికలో మండల వ్యవసాయ అధికారి బి. పూజ ఆధ్వర్యంలో రైతులకు ప్రత్యామ్నాయ పంటల సాగుపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం తగ్గే అవకాశం ఉన్నందున, రైతులు సాంప్రదాయ పంటలకు బదులుగా పండ్ల తోటలు, కందులు, పెసర్లు, మినుములు వంటి పప్పు ధాన్యాలు, కూరగాయల సాగు చేపడితే లాభదాయకంగా ఉంటుందని ఏవో బి. పూజ సూచించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ముత్యాల అంజయ్య, ఏఈఓ రాజేష్‌తో పాటు పలువురు రైతులు పాల్గొన్నారు.
