ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటి సరఫరా…
వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ నిర్మాణ పనులకు వేగం ..
ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలన..
ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు
పాయకాపురం, జులై29(ఆంధ్రప్రభ) : ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటి సరఫరా లక్ష్యంగా వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టడం జరిగిందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని వాంబే కాలనీ సమీపంలో వాటర్ సప్లై విభాగం ఆధ్వర్యంలో మంజూరైన వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ నిర్మాణం కోసం ప్రతిపాదించిన స్థలాన్ని ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు సంబంధిత అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ప్రజలకు నాణ్యమైన తాగునీటిని అందించేందుకు ప్రభుత్వం చేపడుతున్న చర్యల్లో భాగంగా ఈ ప్రాజెక్టు అత్యంత కీలకమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. స్థల పరిశీలన సందర్భంగా ప్రతిపాదిత ప్రాంతం విస్తీర్ణం, భౌగోళిక పరిస్థితులు, నీటి వనరుల లభ్యత, పైప్‌లైన్ అనుసంధానం, విద్యుత్ సౌకర్యం, రాకపోకల మార్గాలు, భవిష్యత్తులో విస్తరణకు ఉన్న అవకాశాలు, నిర్మాణానికి అనుకూల పరిస్థితులు తదితర అంశాలను ఎమ్మెల్యే క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రాజెక్టు అమలులో ఎలాంటి సాంకేతిక, పరిపాలనా అవరోధాలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.ఈ సందర్భంగా వాటర్ సప్లై విభాగం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బి. గోపాల కృష్ణమూర్తి, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్,టీడీపీ నాయకులు గొట్టుముక్కల వెంకి, మాల్యాద్రి, బెజ్జం జైపాల్, తదితరులు పాల్గొన్నారు.
