వైభవంగా గురుపౌర్ణిమ మహోత్సవాలు…

బీసెంట‌ర్ రోడ్డు షిరిడీ సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు
రెండు వేల మంది భక్తులకుపైగా అన్నదానం
ఆల‌య క‌మిటీ అధ్య‌క్షుడు ధూళిపూడి వ‌ల్ల‌భ‌రావు


(విజయవాడ ఆంధ్రప్రభ) : భారతీయ సంస్కృతిలో గురుపౌర్ణిమకు అత్యంత విశిష్టమైన స్థానం ఉందని.. అజ్ఞానాంధకారాన్ని తొలగించి జ్ఞానమార్గాన్ని చూపే గురువును స్మరించుకుని కృతజ్ఞతలు తెలియజేసే పవిత్ర దినమే గురుపౌర్ణిమ అని విజ‌య‌వాడ బీసెంట్‌రోడ్డు శ్రీ షిరిడీ సాయిబాబా మందిరం క‌మిటీ అధ్య‌క్షులు ధూళిపూడి వ‌ల్ల‌భ‌రావు అన్నారు. శ్రీ షిరిడీ సాయిబాబా చూపిన సేవ, ప్రేమ, సమానత్వం, మానవత్వం అనే సందేశాలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టి సమాజ హితానికి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

గురుపౌర్ణిమ పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం విజయవాడ గవర్నర్‌పేట పెద్దిబొట్లవారి వీధిలోని శ్రీ షిరిడీ సాయిబాబా ఆలయంలో గురుపౌర్ణిమ మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆలయ కమిటీ గౌరవ వ్యవస్థాపక అధ్యక్షులు ధూళిపూడి వల్లభరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని బాబా ఆశీస్సులు పొందారు. ఉదయం నుంచే షిరిడీ సాయిబాబాకు పవిత్ర అభిషేకం, అష్టోత్తర నామ పూజ, ప్రత్యేక పూజా కార్యక్రమాలు, వేద మంత్రోచ్ఛారణల నడుమ హారతులు ఘనంగా నిర్వహించారు. అనంతరం భక్తులు భక్తిశ్రద్ధలతో బాబా దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.

గురుపౌర్ణిమ సందర్భంగా సుమారు 2,000 మంది భక్తులకు అన్నప్రసాద వితరణ నిర్వహించారు. ఆలయానికి విచ్చేసిన ప్రతి భక్తికి సాదరంగా అన్నప్రసాదాన్ని అందజేసి సేవా కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాల నిర్వహణను ఆలయ కార్యవర్గ సభ్యులు టి.రాజారెడ్డి, వి.రవికృష్ణారెడ్డి, సీహెచ్. శ్రీనివాసులు, గోసాల శశిధర్, సీహెచ్ శ్రీకృష్ణ, ఎ.సత్యనారాయణ, వి.అశోక్‌కుమార్, ఎ.శ్రీనివాస‌రావు, షేక్ బాజీ, సీహెచ్ ప్ర‌సాద‌రావు, సీహెచ్ నిరంజ‌న్‌, దినేష్ క‌ఠారియా, ల‌లిత్ కుమార్‌జైన్‌, కాళ్ల రాజు, సీహెచ్ ర‌మ‌ణారెడ్డి, బ‌త్తుల తిరుప‌త‌య్య‌, కె.వెంక‌టేశ్వ‌ర‌రెడ్డి తదితరులు పర్యవేక్షించారు. వేడుకల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని గురుపౌర్ణిమ విశిష్టతను స్మరించుకుంటూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తి, సేవ, ఆధ్యాత్మికతను ప్రతిబింబించిన ఈ మహోత్సవాలు భక్తుల హర్షధ్వానాల మధ్య విజయవంతంగా ముగిశాయి.