ప్రజల మెరుగైన భద్రతే లక్ష్యం: ప్రభుత్వ విప్ విజయ రమణారావు

ప్రజల మెరుగైన భద్రతే లక్ష్యం: ప్రభుత్వ విప్ విజయ రమణారావు

– జిల్లా కలెక్టర్, సీపీలతో కలిసి పలు ప్రాంతాల్లో స్థలాల పరిశీలన

– సోమవారం సాయంత్రంలోపు నివేదిక సమర్పించాలని అధికారులకు ఆదేశం

పెద్దపల్లి, ఆంధ్రప్రభ: ప్రజలకు మరింత మెరుగైన, వేగవంతమైన భద్రతా సేవలను అందించేందుకే నూతన పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు తెలిపారు. జిల్లాలో నూతన పోలీస్ స్టేషన్ల ఏర్పాటు కోసం ప్రతిపాదించిన పలు స్థలాలను ఆదివారం ఆయన జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝాతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఈ పర్యటనలో భాగంగా ఎలిగేడు మండలంలో ఏర్పాటు చేయనున్న నూతన పోలీస్ స్టేషన్ స్థలాన్ని, పెద్దకల్వలలోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సమీపంలో ప్రతిపాదించిన స్థలాన్ని పరిశీలించారు. అలాగే పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ ఆవరణలోని మహిళా పోలీస్ స్టేషన్ సమీపంలో, పెద్దపల్లి పట్టణం బంధంపల్లి గ్రామంలో ఏర్పాటు చేయనున్న రూరల్ పోలీస్ స్టేషన్ స్థలాలను కూడా వారు పరిశీలించి, భౌగోళిక పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ చింతకుంట విజయ రమణారావు మాట్లాడుతూ.. పోలీస్ స్టేషన్ల నిర్మాణానికి సంబంధించి పూర్తి అనుకూలమైన స్థలాల ఎంపికపై సమగ్ర నివేదికను సోమవారం సాయంత్రంలోపు సమర్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. నూతన పోలీస్ స్టేషన్ల ఏర్పాటు ద్వారా ప్రజలకు పోలీస్ సేవలు మరింత చేరువవుతాయని, శాంతిభద్రతల పరిరక్షణలో ఇది కీలకమైన ముందడుగు అని ఆయన పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో పెద్దపల్లి మున్సిపల్ చైర్మన్ నూగిల్ల మల్లయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్, సుల్తానాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రకాష్ రావు, పెద్దపల్లి రెవెన్యూ డివిజన్ అధికారి బి. గంగయ్యతో పాటు పలువురు పోలీస్ అధికారులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.