కలిసి పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం..

కలిసి పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం..

కరీంనగర్-జగిత్యాల హైవే విస్తరణ త్వరలోనే: బండి సంజయ్

చొప్పదండి, ఆంధ్రప్రభ:

కలిసి పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందనడానికి చొప్పదండి నియోజకవర్గమే నిదర్శనమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా ప్రజల కోసం పనిచేయడం వల్లే చొప్పదండి ప్రాంతానికి పెద్ద ఎత్తున నిధులు వస్తున్నాయని అన్నారు. బుధవారం కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం ఆర్నకొండ నుంచి మల్యాల వరకు రూ.50 కోట్ల వ్యయంతో 35 కిలోమీటర్ల మేర చేపట్టనున్న డబుల్ లేన్ రోడ్డు విస్తరణ పనులను ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, చొప్పదండి నియోజకవర్గంలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. ఆర్నకొండ గ్రామం నుంచి గోపాల్రావుపేట మీదుగా మల్యాల వరకు సింగిల్ రోడ్డును డబుల్ లేన్‌గా విస్తరించడం వల్ల ఈ ప్రాంత ప్రజలకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. ఈ రహదారి ద్వారా చుట్టుపక్కల మండలాల వ్యవసాయ ఉత్పత్తుల రవాణా సులభతరం అవుతుందని, పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల నుంచి కొండగట్టు ఆలయానికి వచ్చే భక్తులకు ఇది సమీప మార్గంగా మారుతుందని పేర్కొన్నారు.

రోడ్డు విస్తరణలో భాగంగా పలు చోట్ల కల్వర్టులు, ఒకచోట మైనర్ బ్రిడ్జి విస్తరణ పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. ఏడాదిలోపు పనులు పూర్తి చేసి వచ్చే ఏడాది ఏప్రిల్ నెలాఖరు నాటికి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ఏ దేశం, రాష్ట్రం లేదా గ్రామం అభివృద్ధి చెందాలన్నా రవాణా సౌకర్యాలు మెరుగ్గా ఉండాలని పేర్కొన్నారు. అందుకే తాను ఎంపీగా ఎన్నికైనప్పటి నుంచి రోడ్ల నిర్మాణానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చానన్నారు.

గత ఏడేళ్లలో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి కోసం రూ.20 వేల కోట్లకు పైగా కేంద్ర నిధులు తీసుకొచ్చామని, అందులో రూ.7 వేల కోట్లకు పైగా రోడ్ల నిర్మాణానికే ఖర్చు చేశామని వెల్లడించారు. రూ.2,147 కోట్లతో కరీంనగర్-వరంగల్ జాతీయ రహదారి, రూ.578 కోట్లతో ఎల్కతుర్తి-సిద్దిపేట జాతీయ రహదారి పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు.

కరీంనగర్-జగిత్యాల రహదారి విస్తరణ పనులు పలు కారణాలతో ఆలస్యమైనప్పటికీ, దాదాపు రూ.2 వేల కోట్ల నిధులతో ఈ జాతీయ రహదారి పనులను అతి త్వరలో ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. గతంలో తెలంగాణకు మంజూరైన సీఆర్ఎఫ్ నిధుల్లో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి రూ.291 కోట్లు తీసుకువచ్చి 1,341 కిలోమీటర్ల మేర రహదారులు నిర్మించామని చెప్పారు. ఇప్పటి వరకు రూ.400 కోట్లకు పైగా సీఆర్ఎఫ్ నిధులు సమకూర్చినట్లు తెలిపారు.

జాతీయ ఉపాధి హామీ పథకం కింద రూ.700 కోట్లకు పైగా, గ్రామీణ సడక్ యోజన కింద రూ.130 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు వెల్లడించారు. భవిష్యత్తులో కూడా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి మరిన్ని నిధులు తీసుకువచ్చి గ్రామాలు, గల్లీల్లో రహదారుల అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. రాజకీయాలకు అతీతంగా అందరినీ కలుపుకొని అభివృద్ధి కోసం పనిచేస్తానని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు మేడిపల్లి సత్యం, కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్‌రావు, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply