Salary | ప్రతి నెలా 1వ తేదీనే జీతాలు

Salary | ప్రతి నెలా 1వ తేదీనే జీతాలు

Salary | ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందికి ప్రతి నెల 1వ తేదీనే జీతాలు అందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. జీతాల చెల్లింపులో ఆలస్యం జరగకుండా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. బిల్లుల సమర్పణలో జాప్యం కారణంగా జీతాల చెల్లింపులో ఆలస్యాలు తలెత్తుతున్నాయని గుర్తించిన ప్రభుత్వం ఈ అంశంపై సీరియస్‌గా దృష్టి సారించింది. ప్రతి నెల 25వ తేదీలోపు సంబంధిత బిల్లులను ట్రెజరీకి సమర్పించాలని అధికారులకు మార్గదర్శకాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఉద్యోగుల జీతాల విషయంలో నిర్లక్ష్యం ఉండకూడదని, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ప్రభుత్వం సూచించినట్లు సమాచారం. బిల్లులు సమయానికి సమర్పిస్తే జీతాల చెల్లింపులో జాప్యం తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు.

నెలాఖరులోపు బిల్లుల స్క్రూటినీ, ఆడిట్, అథరైజేషన్ ప్రక్రియలు పూర్తి కావాలని ఆదేశించారు. ఉద్యోగులకు 1వ తేదీన జీతాలు పడకపోతే సంబంధిత హెడ్ ఆఫ్ డిపార్ట్‌మెంట్ (HoD), డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్లదే (DDO) పూర్తి బాధ్యత అని, నిర్లక్ష్యం వహిస్తే క్రమశిక్షణ చర్యలు ఉంటాయని ఆర్థిక శాఖ హెచ్చరించింది. ఈ ఉత్తర్వులు అన్ని ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్లు, విశ్వవిద్యాలయాలు, సొసైటీలకు వర్తిస్తాయని, ప్రతి నెలా 1వ తేదీన జీతం పడేలా చూసే సమన్వయ బాధ్యతలను ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్ కార్యదర్శికి అప్పగించారు.