ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు న్యాయమైనవి

ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు న్యాయమైనవి

  • సమ్మెకు హెచ్ఎంఎస్ మద్దతు
  • హెచ్ఎంఎస్ రాష్ట్ర కార్యదర్శి ఆర్‌.ఈశ్వర్ ప్రసాద్

సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మెకు హెచ్ఎంఎస్ సంఘం మద్దతు ప్రకటించింది. సంగారెడ్డి జిల్లా కేంద్ర బస్టాండ్‌ ఎదుట ఆర్టీసీ కార్మికులు భారీగా ఆందోళన నిర్వహించారు. సంఘాలకు గుర్తింపు కల్పించడంతో పాటు తమ 33 డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని కార్మికులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా హెచ్ఎంఎస్ రాష్ట్ర కార్యదర్శి ఆర్‌.ఈశ్వర్ ప్రసాద్ మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికుల సమ్మె న్యాయబద్ధమైనదని తెలిపారు.

కార్పొరేట్ సంస్థలకు సబ్సిడీలు ఇస్తూ ఎలక్ట్రిక్ బస్సులకు ప్రాధాన్యం ఇస్తున్న ప్రభుత్వం, టీజీఎస్ఆ ర్టీసీకి అదే స్థాయిలో మద్దతు ఎందుకు ఇవ్వడంలేదని ప్రశ్నించారు. కార్మికుల డిమాండ్లలో న్యాయం ఉందని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని ట్రేడ్ యూనియన్లు ఐక్యంగా నిలిచి పోరాటాన్ని కొనసాగిస్తామని, ప్రభుత్వం తక్షణమే సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో సమ్మెను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎంఎస్ నాయకులు పి.కొండారెడ్డి, ఓడీఎఫ్ నాయకులు ఎస్‌.ఎఫ్‌.రహమాన్, పి.సూర్యకాంత్ తదితరులు పాల్గొన్నారు.