చౌటపల్లిలో ప్రమాదపు అంచుల్లో ప్రభుత్వ పాఠశాల
చౌటపల్లిలో ప్రమాదపు అంచుల్లో ప్రభుత్వ పాఠశాల
- భారీ వర్షాలకు గోడలు కూలి శిథిలావస్థకు చేరిన ప్రాథమిక పాఠశాల
- తక్షణమే కొత్త భవనం నిర్మించాలని తల్లిదండ్రుల డిమాండ్
అచ్చంపేట, ఆంధ్రప్రభ : అచ్చంపేట మండలం, చౌటపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాల భవనం ప్రమాదపు అంచుల్లో నిలిచింది. గత రెండు, మూడు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు పాఠశాల భవనం గోడలు కూలిపోవడంతో తరగతి గదులు శిథిలావస్థకు చేరుకున్నాయి. ఎప్పుడు ఏ భాగం కూలిపోతుందోనన్న భయంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. ఈ పాఠశాలలో 7వ తరగతి వరకు బోధన జరుగుతుండగా, ప్రస్తుతం తరగతి గదులు దెబ్బతినడంతో విద్యార్థుల చదువుకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది.

సరైన గదులు లేక బహిరంగ ప్రదేశాల్లో లేదా ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో తరగతులు నిర్వహించాల్సిన పరిస్థితి నెలకొంది. అంతేకాక పాఠశాల వంటగది కూడా దెబ్బతినడంతో మధ్యాహ్న భోజన పథకం అమలులో ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఉపాధ్యాయులు తెలిపారు. చిన్నారుల భద్రత దృష్ట్యా వెంటనే చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. పాఠశాల పరిస్థితిని పరిశీలించిన విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి తాత్కాలికంగా సురక్షిత భవనం ఏర్పాటు చేయడంతో పాటు కొత్త పాఠశాల భవనం నిర్మించాలని డిమాండ్ చేశారు. “ప్రమాదం జరిగాక స్పందించడం కాదు, ముందుగానే చర్యలు తీసుకోవాలి” అని తల్లిదండ్రులు కోరుతున్నారు.
