డాగ్ స్క్వాడ్‌తో కిరాణా దుకాణాల్లో ఆకస్మిక సోదాలు
డాగ్ స్క్వాడ్‌తో కిరాణా దుకాణాల్లో ఆకస్మిక సోదాలు
గుట్కా, గంజాయి విక్రయాలపై పోలీసుల ఉక్కుపాదం
దండేపల్లి, ఆంధ్రప్రభ : నిషేధిత పొగాకు ఉత్పత్తులు, మాదకద్రవ్యాలు, గుట్కా, ఇతర అక్రమ పదార్థాల నియంత్రణ లక్ష్యంగా దండేపల్లి మండలంలోని తాళ్లపేట, మ్యాదరిపేట గ్రామాల్లో పోలీసులు సోమవారం ముమ్మర సోదాలు నిర్వహించారు.
స్థానిక ఎస్సై రాజవర్ధన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ తనిఖీల్లో ప్రత్యేకంగా శిక్షణ పొందిన డాగ్ స్క్వాడ్‌ను వినియోగించారు. కిరాణా దుకాణాలతో పాటు వాటికి అనుబంధంగా ఉన్న గోదాములు, అనుమానాస్పద ప్రదేశాలను డాగ్ స్క్వాడ్ సహాయంతో క్షుణ్ణంగా పరిశీలించారు.
నిషేధిత గుట్కా, పొగాకు ఉత్పత్తులు, గంజాయి లేదా ఇతర మత్తు పదార్థాలు నిల్వ ఉంచారా అనే కోణంలో సోదాలు నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు.
ఈ సందర్భంగా ఎస్సై రాజవర్ధన్ మాట్లాడుతూ, కిరాణా దుకాణాల పేరుతో ఎవరైనా నిషేధిత గుట్కాలు, గంజాయి లేదా ఇతర మత్తు పదార్థాలను విక్రయిస్తే కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. యువతను తప్పుదోవ పట్టించే అక్రమ వ్యాపారాలను ఏమాత్రం సహించబోమని స్పష్టం చేశారు.
గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతున్న ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండి పోలీసులకు సమాచారం అందించాలని ఆయన కోరారు. ఈ సోదాల్లో స్థానిక పోలీసు సిబ్బంది, డాగ్ స్క్వాడ్ బృందం పాల్గొన్నారు.
