నీట మునిగిన పత్తి చేలు..
దండెపల్లి, ఆంధ్రప్రభ : ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. మంచిర్యాల జిల్లా దండెపల్లి మండలం కన్నెపల్లి గ్రామ పరిధిలోని పత్తి పొలాలు వర్షపు నీటిలో పూర్తిగా మునిగిపోయాయి. ఎకరాల కొద్దీ సాగు చేసిన పత్తి పంట నీటిలో చిక్కుకుపోవడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పొలాల్లో నిల్వ నీరు బయటకు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో పత్తి మొక్కలు కుళ్లిపోయే ప్రమాదం ఉందని రైతులు చెబుతున్నారు. ఇప్పటికే సాగు కోసం భారీగా పెట్టుబడులు పెట్టామని, ఇప్పుడు పంట దెబ్బతింటే తీవ్ర నష్టాలు తప్పవని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు వెంటనే క్షేత్రస్థాయిలో పంట నష్టాన్ని అంచనా వేసి, ప్రభుత్వం తగిన నష్టపరిహారం అందించాలని రైతులు కోరుతున్నారు.
