ఈనెల 21న నగరంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు…

ఈనెల 21న నగరంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు…

యోగా దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరు కానున్న సీఎం
అంతర్జాతీయ యోగా దినోత్సవ నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు చేయాలి..
జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ.

విజయవాడ, ఆంధ్రప్రభ : ఈ నెల 21వ తేదీన ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారని, యోగా దినోత్సవ వేడుకలు విజయవంతం అయ్యేలా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. ఈ నెల 21న ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమం ఏర్పాట్లపై శనివారం జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ, నగర పోలీసు కమిషనర్ ఎం. రాజశేఖర్ బాబు, విజయవాడ మున్సిపల్ కమిషనర్ హెచ్.ఎం. ధ్యానచంద్ర, జాయింట్ కలెక్టర్ ఎస్. ఇలక్కియా తదితరులతో కలిసి స్టేడియాన్ని పరిశీలించి వివిధ శాఖల అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఈ నెల 21వ తేదీన నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారని తెలిపారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో సుమారు 5,000 మంది యోగా సాధకులు, విద్యార్థులు, ప్రజలు యోగా ఆసనాల్లో పాల్గొనేందుకు రానున్నరన్నారు. ఇందుకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేయాలని సంబంధిత శాఖల అధికారులకు సూచించారు. కార్యక్రమంలో పాల్గొనేవారికి తాగునీరు, వైద్య సదుపాయాలు, పారిశుద్ధ్యం, విద్యుత్, ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా చర్యలు తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. మున్సిపల్, పోలీసు ఇతర ప్రభుత్వ శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను పర్యవేక్షించాలని ఆదేశించారు.

వాతావరణ పరిస్థితులు అనుకూలించక వర్షం కురిసే అవకాశం ఉంటే కార్యక్రమాన్ని అంబేద్కర్ కళావేదికలో నిర్వహించేలా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు. ఇందుకోసం అక్కడ కూడా అవసరమైన అన్ని సౌకర్యాలను ముందస్తుగా ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యే ప్రజలు, విద్యార్థులు, యోగా సాధకులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ తెలిపారు. కార్యక్రమం నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లను జిల్లా స్థాయి అధికారులు సమన్వయంతో పూర్తి చేసి, ప్రాంగణాన్ని సిద్ధం చేసేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డా. జి. లక్ష్మీశ తెలిపారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం పరిశీలనలో జిల్లా కలెక్టర్ వెంట వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.