పది నెలల తర్వాత జారీ అయిన ఉత్తర్వులు
ఆంధ్రప్రభలో వరుస కథనాల అనంతరం చర్యలు
సస్పెన్షన్ ఆలస్యంపై ఉన్నతాధికారిపై చర్యలు కోరుతున్న విద్యార్థి సంఘాలు
ఆంధ్రప్రభ ప్రతినిధి, సూర్యాపేట: ఫోక్సో కేసులో ఏ–2 నిందితుడిగా అరెస్టైన ప్రభుత్వ ఉపాధ్యాయుడిపై పది నెలల తర్వాత సస్పెన్షన్ చర్యలు తీసుకున్నారు. గత ఏడాది సెప్టెంబర్ 2న మైనర్ బాలిక ధ్రువీకరణ పత్రాలను మార్చి ఓ కానిస్టేబుల్‌తో వివాహం జరిపించిన కేసులో అరెస్టైన ఉపాధ్యాయుడిపై వెంటనే సస్పెన్షన్ చర్యలు తీసుకోలేదన్న ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంపై “అక్రమార్కులకు అశోక చక్రం”, “సస్పెన్షన్ నిలిపివేసేందుకు మూడు లక్షలు” శీర్షికలతో ఆంధ్రప్రభ లో వరుస కథనాలు ప్రచురితమయ్యాయి. అనంతరం జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ క్షేత్రస్థాయిలో విచారణకు ఆదేశించగా, జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ సదరు ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
సూర్యాపేట మున్సిపల్ పరిధిలోని పిల్లలమర్రి ప్రభుత్వ పాఠశాలలో ఎస్‌జీటీగా పనిచేస్తున్న భూక్య నారాయణ తన స్వగ్రామమైన సూర్యాపేట మండలంలోని ఓ తండాకు చెందిన మైనర్ బాలిక ధ్రువీకరణ పత్రాలను మార్చి, ఓ కానిస్టేబుల్‌కు నాలుగో వివాహం జరిపించిన కేసులో ఏ–2 నిందితుడిగా పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.
ఈ ఘటనపై బాలిక బంధువులు సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, కానిస్టేబుల్‌తో పాటు భూక్య నారాయణపై కేసు నమోదు చేశారు. అనంతరం ఆయన సెలవులు తీసుకుని, సెప్టెంబర్ 19న తిరిగి విధుల్లో చేరినట్లు సమాచారం.
భూక్య నారాయణపై విద్యాశాఖ అధికారులకు లిఖితపూర్వక ఫిర్యాదు అందడంతో క్షేత్రస్థాయిలో విచారణ నిర్వహించి, జిల్లా విద్యాశాఖ అధికారికి నివేదిక సమర్పించినట్లు తెలిసింది. అయితే, సస్పెన్షన్ చర్యలు తీసుకోకపోవడంపై బాధిత బాలిక తల్లిదండ్రులు అభ్యంతరం వ్యక్తం చేశారు. కొందరు విద్యార్థి సంఘాల నాయకులు కూడా ఈ అంశంపై విద్యాశాఖ అధికారులను ప్రశ్నించినట్లు తెలిపారు.
ఈ క్రమంలో ఆంధ్రప్రభలో వరుస కథనాలు ప్రచురితమయ్యాయి. అనంతరం తెలంగాణ సివిల్ సర్వీసెస్ రూల్స్–1991లోని రూల్ 8, సబ్ రూల్ (1) ప్రకారం ప్రజా ప్రయోజనాల దృష్ట్యా భూక్య నారాయణను తక్షణమే సస్పెండ్ చేస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ ప్రకటించారు.
క్రమశిక్షణా విచారణ పూర్తయ్యే వరకు సస్పెన్షన్ కొనసాగుతుందని, ముందస్తు అనుమతి లేకుండా సూర్యాపేటను విడిచి వెళ్లరాదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా, అరెస్టైన ఉపాధ్యాయుడిపై సస్పెన్షన్ చర్యలు ఆలస్యంగా తీసుకున్న వ్యవహారంపై సంబంధిత ఉన్నతాధికారిపై కూడా విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
