అధికారులపై చర్యలు తీసుకోవడంలో పోలీసులు విఫలం…..

  • కోర్టు ఆదేశాలు పాటించని వైనం

జనగామ, ఆంధ్రప్రభ : జనగామ జిల్లాలో గతంలో పనిచేసిన కలెక్టర్ శివలింగయ్యతో పాటు ఇతర అధికారులపై కేసులు నమోదు అయినప్పటికీ, వాటిపై పోలీసులు చర్యలు తీసుకోవడంలో పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారని సీపీఎం జిల్లా కార్యదర్శి మోకు కనకా రెడ్డి తీవ్రంగా విమర్శించారు. తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

శనివారం జిల్లా కేంద్రంలోని సీపీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… ఐదు సంవత్సరాల క్రితం స్టేషన్‌గన్‌పూర్ నియోజకవర్గంలోని తాటికొండ గ్రామంలో మహోదయ గ్రామైక్య సంఘం నిర్వహణపై ఎలాంటి ఆధారాలు లేకుండా అవినీతిని మోపుతూ, ఏపీఎం కవిత తప్పుడు ఆడిట్ రిపోర్ట్ ఇచ్చిందని ఆరోపించారు. అదే కారణంగా వివోఏ చాడ సునీతను అక్రమంగా తొలగించారని తెలిపారు.

సునీత పలుమార్లు అప్పటి జిల్లా కలెక్టర్ శివలింగయ్య, డీఆర్‌డీఓ రామ్‌రెడ్డితో సహా అధికారులను విచారణ చేపట్టాలని కోరినా స్పందించలేదని చెప్పారు. ఆర్టీఐ ద్వారా పొందిన రికార్డులను ప్రైవేట్ ఆడిటర్‌తో తనిఖీ చేయించగా ఎటువంటి అవకతవకలు లేవని స్పష్టమైందని తెలిపారు. అయినప్పటికీ సునీతను దోషిగా చిత్రీకరిస్తూ తీవ్ర అవమానాలకు గురి చేశారని అన్నారు.

ఈ విషయంపై బాధితురాలు చాడ సునీత పోరాటం కొనసాగిస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయించగా, గత సంవత్సరం డిసెంబరులో జిల్లా కలెక్టర్, డీఆర్‌డీఓతో సహా 12 మంది అధికారులపై కేసు నమోదు చేయాలని కోర్టు పోలీసులకు ఆదేశించిందని కనకా రెడ్డి పేర్కొన్నారు. అయితే కేసు నమోదు చేసినప్పటికీ ఒక సంవత్సరం గడిచినా విచారణలో ఎలాంటి పురోగతి లేదని, పోలీసులు పూర్తిగా నిర్లక్ష్యం చూపుతున్నారని విమర్శించారు.

సామాన్యులపై వచ్చిన ఫిర్యాదులకు వెంటనే స్పందించే పోలీసులు, ఉన్నతాధికారులు కేసులో ఉన్నప్పుడు నిర్లక్ష్యంగా వ్యవహరించడం అన్యాయం అని పేర్కొన్నారు. ఒక దళిత మహిళ అయిన సునీతను ఇలా వేధింపులకు గురి చేయడం అస్సలు సమంజసం కాదని మండిపడ్డారు.

కేసు విచారణను వెంటనే పూర్తి చేసి, దోషులను కోర్టులో ప్రవేశపెట్టి బాధితురాలు సునీతకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించారు.

సమావేశంలో జిల్లాఐద్వా అధ్యక్షురాలు అహల్య, పార్టీ జిల్లా కమిటీ సభ్యులు బూడిద గోపి, జోగు ప్రకాష్, సుంచు విజేందర్, కేవీపీఎస్ జాతీయ నాయకురాలు పల్లెర్ల లలిత, గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి అజ్మీర సురేష్ నాయక్, నాయకులు వెంకటేష్, నాగరాజ్, మల్లేష్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply