PM Modi @ 12 Years | ప్రజలే నాకు దేవుళ్లు.. వారే నా శక్తి
PM Modi @ 12 Years | ప్రజలే నాకు దేవుళ్లు.. వారే నా శక్తి
ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) తన పాలనకు 12 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా ఢిల్లీలో జరిగిన ఎన్డీయే పక్షాల సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ సేవ చేసే అవకాశం తనకు దక్కడం గొప్ప సౌభాగ్యమని, దేవుడి కృపతో పాటు ప్రజల ఆశీర్వాదాల వల్లే ఇది సాధ్యమైందని అన్నారు. నేను సేవను ఎప్పుడూ ఉద్యోగంలా చూడలేదు. అది ఒక సామూహిక యజ్ఞంలా భావించాను. ఎన్డీయే కుటుంబంలోని ప్రతి ఒక్కరూ కర్తవ్య భావంతో దేశ సేవలో భాగస్వాములు అవుతున్నారు. ఈ ప్రయాణం మీ అందరి సహకారంతోనే కొనసాగుతోంది అని మోదీ పేర్కొన్నారు.
తనకు శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపిన మోదీ.. ఇది నా జీవితంలో ఒక అద్భుత క్షణం. ప్రజలే నాకు దేవుళ్లు. నా ఈ రికార్డును ఎన్డీయేలోని ప్రతి కార్యకర్తకు అంకితం చేస్తున్నాను. భారత ప్రజల వివేకం, ప్రజాస్వామ్యంపై వారి విశ్వాసం దేశానికి బలాన్ని ఇస్తోంది అని అన్నారు. 2014కు ముందు దేశం ఎన్నో సంవత్సరాల పాటు రాజకీయ అస్థిరతను ఎదుర్కొందని, దాని ప్రభావం దేశ అభివృద్ధిపై పడిందని మోదీ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం దేశ ప్రజలు స్థిరమైన ప్రభుత్వాన్ని చూస్తున్నారని, ప్రభుత్వ నిర్ణయాలకు మద్దతు తెలుపుతున్నారని పేర్కొన్నారు. ఈ విశ్వాసానికి దేశ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.

2014లో ఎన్డీయే అధికారంలోకి వచ్చినప్పుడు ప్రజల్లో ఎన్నో ఆశలు, ఆకాంక్షలు ఉన్నాయని తాను చెప్పానని గుర్తుచేసిన మోదీ.. వాటిని నిలబెట్టడం తమ బాధ్యతగా భావించామని అన్నారు. కాంగ్రెస్‌పై ప్రజలు విశ్వాసం కోల్పోయారని, ఎన్డీయేపై నమ్మకం మరింత పెరుగుతోందని పేర్కొన్నారు. “దేశ ప్రజల విశ్వాసాన్ని గెలుచుకోవడం కంటే గొప్ప విజయమేమీ లేదు. ఆ విశ్వాసాన్ని మరింత బలోపేతం చేస్తూ దేశాభివృద్ధి కోసం ఎన్డీయే నిరంతరం కృషి చేస్తుంది” అని మోదీ స్పష్టం చేశారు.
గత 12 ఏళ్లలో 25 కోట్ల మందికి పైగా ప్రజలను పేదరిక రేఖ నుంచి పైకి తీసుకొచ్చామని ప్రధానమంత్రి మోదీ తెలిపారు. పేదల అభ్యున్నతి, వికసిత భారత్ లక్ష్యంపై తన ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. నిన్నటి పేదలు నేడు న్యూ మిడిల్ క్లాస్‌గా మారుతున్నారు. వారి కలలు నిజం కావడానికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోంది. వారిని వెనుకబాటుకు నెట్టకుండా మరింత ముందుకు తీసుకెళ్లేందుకు రేయింబవళ్లు శ్రమిస్తాం అని మోదీ అన్నారు.
దేశంలోని 140 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్న ఆయన.. యువత, మహిళలు, రైతులు, మధ్యతరగతి ప్రజల ఆశయాలను సాకారం చేయడమే తమ లక్ష్యమని చెప్పారు. వికసిత భారత్ నిర్మాణం దేశ ప్రజలందరి సంకల్పమని, ఆ లక్ష్య సాధన కోసం నిరంతరం అంకితభావంతో పనిచేయాల్సిన అవసరం ఉందని మోదీ అన్నారు. గత 12 ఏళ్లుగా ఎన్డీయే ప్రభుత్వం అదే దిశగా పనిచేస్తోంది. దేశాన్ని అభివృద్ధి మార్గంలో నడిపిస్తున్నాం అని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేసిన మోదీ.. “కాంగ్రెస్ పాలనలో దేశం అవినీతి, విధానాల లోపాలతో నష్టపోయింది. కాంగ్రెస్‌లో పాలన లేదు, నీతి లేదు, స్పష్టమైన నిర్ణయాలు లేవు. భారతీయుల అభివృద్ధి రేటు పెరగాలి.. కాంగ్రెస్ ప్రభావం తగ్గాలి” అని వ్యాఖ్యానించారు.
మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం దేశంలో అభివృద్ధికి బాటలు వేసిందని మోదీ గుర్తు చేశారు. అనంతరం కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి మందగించిందని, భారీ అవినీతి కుంభకోణాలు చోటుచేసుకున్నాయని ఆరోపించారు. దేశాన్ని తిరిగి పురోగతి దిశగా నడిపించేందుకే 2014లో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని ఆయన తెలిపారు.
గత 12 ఏళ్లలో భారత్ అన్ని రంగాల్లో గణనీయమైన పురోగతి సాధించిందని ప్రధానమంత్రి మోదీ పేర్కొన్నారు. 2014తో పోలిస్తే దేశంలో మౌలిక సదుపాయాలు, డిజిటల్ సేవలు, ఇంధన రంగంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయని అన్నారు. దేశ ప్రజలు ఇప్పుడు నీతి, నియమబద్ధమైన పాలనను, మంచి నిర్ణయాలను చూస్తున్నారు. అభివృద్ధి స్పష్టంగా కనిపిస్తోంది. 2014 నాటి భారత్‌కు, నేటి భారత్‌కు చాలా తేడా ఉంది” అని మోదీ పేర్కొన్నారు.
దేశవ్యాప్తంగా ఎయిర్‌పోర్టులు, ఎక్స్‌ప్రెస్‌వేలు, మెట్రో రైలు వ్యవస్థలు భారీగా పెరిగాయని ఆయన తెలిపారు. రక్షణ రంగానికి గతంతో పోలిస్తే మరింత అధిక నిధులు కేటాయిస్తున్నామని చెప్పారు. డిజిటల్ రంగంలో భారత్ సాధించిన ప్రగతిని ప్రస్తావిస్తూ.. “2014లో దేశంలో సుమారు 25 కోట్ల మంది మాత్రమే ఇంటర్నెట్ వినియోగించేవారు. ఇప్పుడు ఆ సంఖ్య 100 కోట్లకు పైగా చేరింది. అప్పట్లో డిజిటల్ పేమెంట్స్ పరిమితంగా ఉండేవి. ప్రస్తుతం డిజిటల్ లావాదేవీల్లో భారత్ ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంది” అని అన్నారు.
పునరుత్పాదక ఇంధన రంగంలోనూ భారత్ వేగంగా ముందుకు సాగుతోందని మోదీ పేర్కొన్నారు. “సోలార్ పవర్ ఉత్పత్తి సామర్థ్యం 150 గిగావాట్లకు పైగా చేరింది. గతంలో ఇథనాల్ బ్లెండింగ్ దాదాపు లేకపోయినా, ఇప్పుడు 20 శాతం ఇథనాల్ మిశ్రమ లక్ష్యాన్ని సాధించాం. అలాగే సెమీకండక్టర్ తయారీ రంగంలో కూడా భారత్ కొత్త అడుగులు వేస్తోంది” అని వివరించారు. దేశ అభివృద్ధి ప్రయాణంలో సాంకేతికత, మౌలిక సదుపాయాలు, స్వయం సమృద్ధి కీలక పాత్ర పోషిస్తున్నాయని మోదీ స్పష్టం చేశారు.
యువత సాధికారత, క్రీడలు, పర్యాటకం, మౌలిక సదుపాయాల అభివృద్ధి ద్వారా వికసిత భారత్ లక్ష్యాన్ని సాధిస్తామని మోదీ తెలిపారు. దేశ అభివృద్ధికి రాష్ట్రాల మధ్య సమన్వయం, సహకారం అత్యంత కీలకమని పేర్కొన్నారు. “యువత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని స్కిల్ డెవలప్‌మెంట్ శాఖను ఏర్పాటు చేశాం. దివ్యాంగుల హక్కుల పరిరక్షణ కోసం చట్టాలు తీసుకొచ్చాం. ఆదివాసీల సంక్షేమం కోసం కూడా పలు చర్యలు చేపట్టాం” అని మోదీ చెప్పారు.
పర్యాటకం, క్రీడల రంగాల్లో భారత్ ప్రపంచ స్థాయిలో మరింత ముందుకు వెళ్లాలని ఆయన ఆకాంక్ష వ్యక్తం చేశారు. ఆధునిక మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం దృష్టి సారించిందని, క్రీడల్లో భారత్ మరింత మెరుగైన ఫలితాలు సాధించాలని అన్నారు. భవిష్యత్తులో ఒలింపిక్స్ నిర్వహణకు కూడా భారత్ సిద్ధమవుతోందని పేర్కొన్నారు.
“మన లక్ష్యాలు చిన్నవిగా ఉండకూడదు. పెద్దగా ఆలోచించాలి. భారత్ ప్రస్తుతం సంస్కరణల దిశగా వేగంగా ముందుకు సాగుతోంది. దేశ ప్రజలు కూడా ఆ మార్పులకు మద్దతు ఇస్తున్నారు. గత 12 సంవత్సరాలు అభివృద్ధి ఉత్సవంలా సాగాయి. ప్రజల మనసులను గెలుచుకోగలిగాం” అని మోదీ అన్నారు.
ప్రపంచంలోని అనేక దేశాలు ఆర్థిక, రాజకీయ సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ భారత్ స్థిరంగా నిలబడగలిగిందని ఆయన పేర్కొన్నారు. ప్రజల ఆశలను వమ్ము చేయకుండా పనిచేస్తామని స్పష్టం చేశారు. “సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా ప్రయాస్” అనే మంత్రంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని చెప్పిన మోదీ.. అందరి అభివృద్ధే దేశాభివృద్ధికి పునాది అని తెలిపారు.
రాష్ట్రాల మధ్య విభేదాలకు తావులేకుండా కలిసి పనిచేస్తేనే ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ, ఆవిష్కరణలు, ఉపాధి అవకాశాలు మరింత వేగంగా పెరుగుతాయని ఆయన పేర్కొన్నారు. “రాష్ట్రాల ప్రగతే దేశ ప్రగతి. భేదాభిప్రాయాలను పక్కనపెట్టి కలిసి ముందుకు సాగుదాం. రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలు సాధిద్దాం” అని పిలుపునిచ్చారు. చివరిగా దేశ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన మోదీ.. “ప్రజలే నాకు శక్తి, ప్రేరణ, ప్రోత్సాహం. వారి ఆశీర్వాదాలే నా బలం” అని అన్నారు.
PoK | కుప్పకూలిన ఆర్మీ హెలీకాప్టర్..
PM Modi PM Modi PM Modi PM Modi PM Modi PM Modi PM Modi PM Modi PM Modi PM Modi
