ములుగు పోలీస్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడిగా పేరూరు ఎస్సై
గుర్రం కృష్ణప్రసాద్ గౌడ్‌కు ఎస్పీతో పాటు పలువురి అభినందనలు
వాజేడు, ఆంధ్రప్రభ: ములుగు పోలీస్ అసోసియేషన్ నూతన ఎన్నికల్లో పేరూరు ఎస్సై గుర్రం కృష్ణప్రసాద్ గౌడ్ ములుగు జిల్లా ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
ఈ సందర్భంగా ములుగు జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ ఆయనను అభినందించారు. పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ కేవలం ఒక సంఘంగా కాకుండా, పోలీసు అధికారుల సంక్షేమం, పరస్పర సహకారం, వృత్తిపరమైన అభివృద్ధి, సేవా నిబద్ధతను మరింత బలోపేతం చేసే వేదికగా నిలవాలని ఆకాంక్షించారు.
పోలీసు అధికారులు, సిబ్బంది ఎదుర్కొనే సమస్యలను బాధ్యతాయుతంగా గుర్తించి, వాటి పరిష్కారానికి సమన్వయంతో కృషి చేయాలని సూచించారు. జిల్లా పోలీసు శాఖ ప్రతిష్ఠను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లే విధంగా అసోసియేషన్ బాధ్యతలను నిర్వర్తించాలని కోరారు.
ములుగు జిల్లా పోలీస్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన గుర్రం కృష్ణప్రసాద్ గౌడ్‌ను మండల ప్రజలు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు అభినందించారు.
