గంజాయితో ఇద్దరు యువకులు అరెస్ట్
- 114 గ్రాముల గంజాయి స్వాధీనం..
- సరఫరాదారుల కోసం గాలింపు
- గంజాయి రవాణా, వినియోగంపై కఠిన చర్యలు తప్పవు : సీఐ క్రాంతి కుమార్
పరకాల, ఆంధ్రప్రభ : గంజాయి సేవిస్తూ పట్టుబడిన ఇద్దరు యువకులను అరెస్టు చేసి 114 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు పరకాల పోలీస్ సీఐ వి. క్రాంతి కుమార్ తెలిపారు. గంజాయి రవాణా, విక్రయాలు, వినియోగంపై ఎలాంటి రాజీ లేకుండా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. పరకాల మండలం పోచారం గ్రామ శివారులోని మాటు కట్ట సమీపంలో పోలీసులు గస్తీ నిర్వహిస్తున్న సమయంలో ఇద్దరు యువకులు అనుమానాస్పదంగా కనిపించారు. పోలీసులను గమనించగానే కాలేజీ బ్యాగ్‌తో పరారయ్యేందుకు ప్రయత్నించగా, వెంటనే వారిని అదుపులోకి తీసుకుని విచారించారు.
నిందితులు జన్ను నేస్తం అలియాస్ రాకేశ్ (20), **ఇప్ప హేమంత్ (19)**గా గుర్తించారు. వారి వద్ద ఉన్న బ్యాగ్‌ను పంచుల సమక్షంలో తనిఖీ చేయగా, గులాబీ రంగు కవర్‌లో 114 గ్రాముల గంజాయి లభించింది. అలాగే రెండు సెల్‌ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు.
విచారణలో ములుగు జిల్లా జంగాలపల్లి ప్రాంతానికి చెందిన రాజేష్ అనే వ్యక్తి వద్ద నుంచి గంజాయిని కొనుగోలు చేసినట్లు నిందితులు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. కొనుగోలు చేసిన గంజాయిలో కొంత భాగాన్ని వెల్లంపల్లి గ్రామానికి చెందిన మచ్చ సన్నీ, బరిగెల సాత్విక్, సీసీల్లకు విక్రయించినట్లు వెల్లడించినట్లు చెప్పారు. మిగిలిన గంజాయిని పోచారం శివారులో సేవిస్తున్న సమయంలో పోలీసులు పట్టుకున్నట్లు వివరించారు.
నిందితులపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం వారిని జైలుకు రిమాండ్ చేసినట్లు సీఐ తెలిపారు. గంజాయి సరఫరా చేసిన వ్యక్తులు, కొనుగోలు చేసిన ఇతరుల కోసం దర్యాప్తు కొనసాగుతోందన్నారు.
ఈ కేసును ఛేదించడంలో ప్రతిభ కనబరిచిన ఎస్సై పి. పవన్, కానిస్టేబుళ్లు నాగరాజు, రామకృష్ణ, సురేష్, భాస్కర్‌లను పరకాల సీఐతో పాటు ఏసీపీ, ఈస్ట్ జోన్ డీసీపీ అభినందించినట్లు తెలిపారు
