సెంట్రల్ సమగ్రాభివృద్ధే ధ్యేయం
- నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సంక్షేమ కార్యక్రమాలపై చంద్రబాబుతో చర్చలు
- కొనసాగుతున్న అభివృద్ధి పనులు, భవిష్యత్ కార్యాచరణపై సానుకూల సమీక్ష
- పార్టీ బలోపేతం, ప్రజలకు ప్రభుత్వ కార్యక్రమాల చేరువపై చర్చ
- సీఎంను కలిసిన యువ నాయకులు బొండా సిద్ధార్థ, బొండా రవితేజ
- సీఎం మార్గదర్శకత్వంలో సెంట్రల్ అభివృద్ధికి మరింత వేగం
- విప్ బొండా ఉమా
పాయికాపురం, ఆంధ్రప్రభ: ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాసంలో ప్రభుత్వ విప్, విజయవాడ సెంట్రల్ శాసనసభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు బుధవారం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ యువ నాయకులు బొండా సిద్ధార్థ, బొండా రవితేజ కూడా ముఖ్యమంత్రిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ భేటీలో రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమ కార్యక్రమాలతో పాటు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు, చేపట్టాల్సిన కొత్త ప్రాజెక్టులు, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాల కల్పన, రానున్న కార్యక్రమాలు, పార్టీ సంస్థాగత బలోపేతానికి సంబంధించిన పలు అంశాలపై విస్తృతంగా చర్చించినట్లు సమాచారం.
ఈ సందర్భంగా బొండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దూరదృష్టి నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో వేగంగా ముందుకు సాగుతోందన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోందని పేర్కొంటూ, ఇందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా సంక్షేమం, మౌలిక సదుపాయాల అభివృద్ధి, నియోజకవర్గ అవసరాలకు అనుగుణంగా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టే దిశగా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని తెలిపారు. ముఖ్యమంత్రి మార్గదర్శకత్వంలో ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత సమర్థవంతంగా తీసుకెళ్లడంతో పాటు, కార్యకర్తలతో సమన్వయంగా పనిచేస్తూ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కట్టుబడి ఉంటామని బొండా ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు.

