ధరల పెరుగుదలపై ఆందోళన

చిట్యాల, ఆంధ్రప్రభ : యుద్ధ పరిస్థితుల కారణంగా నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంతో పాటు గ్యాస్ సరఫరాలో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సీపీఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

మంగళవారం చిట్యాల మండలం వెలిమినేడు గ్రామంలో జరిగిన సీపీఎం గ్రామ జనరల్ బాడీ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. యుద్ధ నివారణ చర్యలు చేపట్టాల్సిన భారత ప్రధాని మోదీ, ట్రంప్‌కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేరళ ఎన్నికల ప్రచారంలో చేసిన వ్యాఖ్యలు అనుచితమని పేర్కొన్నారు. కేరళ ప్రభుత్వం విద్య, వైద్యం, పేదరిక నిర్మూలనలో ఆదర్శంగా నిలుస్తోందని, ఇచ్చిన హామీలను అమలు చేయడంలో చిత్తశుద్ధి చూపాలని డిమాండ్ చేశారు.

అర్హులైన పేదలకు ఇండ్లు, ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలని కోరుతూ, లేనిపక్షంలో సీపీఎం ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకుడు, గ్రామ సర్పంచ్ బొంతల చంద్రారెడ్డి గ్రామ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని తెలిపారు. నెలికంటి నర్సింహా అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు జిట్ట నగేష్, మల్లం మహేష్, మండల నాయకులు అరూరి శ్రీను, పంది నరేష్, సుర్కంటి మోహన్ రెడ్డి, అరూరి దుర్గయ్య, శంభయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply