AP| ప్రయాణికులకు ప్రాణసంకటంగా మారిన వంతెన…
- గుంతలు, పగుళ్లతో నరకయాతన
- వంతెనల నిర్వహణ బాధ్యత ఎవరిది..?
- ఆర్‌అండ్‌బీ, సంబంధిత అధికారులు ఎక్కడ..?
- ఆంధ్రప్రభ ప్రత్యేక కథనం
AP| చిలకలూరిపేట, ఆగస్టు 1: కోట్లాది రూపాయల ప్రజాధనంతో నిర్మించిన వంతెనలు కాలక్రమేణా నిర్వహణ లేక శిధిలావస్థకు చేరుకుంటున్నా సంబంధిత శాఖల నిర్లక్ష్యం కారణంగా ప్రజలు నిత్యం ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ప్రయాణించాల్సిన పరిస్థితి నెలకొంది. చిలకలూరిపేట పట్టణం నుంచి పసుమర్రు గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారిలో మద్ది వెంకటరత్నం కంపెనీ సమీపంలో ఓగేరు వాగుపై నిర్మించిన వంతెన ప్రస్తుతం అత్యంత ప్రమాదకర స్థితికి చేరుకుంది. రోజూ వేలాది మంది ప్రయాణించే ఈ వంతెనపై ఏర్పడిన గుంతలు, పగుళ్లు ప్రమాదాలకు ఆహ్వానం పలుకుతున్నా సంబంధిత అధికారులు మాత్రం ఇప్పటికీ స్పందించడం లేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రెండు దశాబ్దాల క్రితం నిర్మాణం
దాదాపు రెండు దశాబ్దాల క్రితం పాత లో-లెవల్ క్రాస్‌వే దెబ్బతినడంతో అప్పటి శాసనసభ్యుడు సహకారంతో పసుమర్రు గ్రామ ప్రజల రాకపోకలకు అంతరాయం కలగకుండా ఓగేరు వాగుపై వంతెన నిర్మించారు. గ్రామానికి వెళ్లే రహదారిని అభివృద్ధి చేయడంతో పాటు వాగు కట్టలను కూడా బలోపేతం చేశారు. ఆ సమయంలో ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా మారిన ఈ వంతెన ప్రస్తుతం కనీస నిర్వహణ లేక శిథిలావస్థకు చేరుకుంది.

మరమ్మతులు లేక దయనీయ పరిస్థితి
వంతెన నిర్మాణం పూర్తయిన తర్వాత ఇప్పటివరకు సమగ్ర మరమ్మతులు చేపట్టలేదని స్థానికులు చెబుతున్నారు. కాలక్రమేణా వంతెన డెక్‌పై పగుళ్లు ఏర్పడగా, పాదచారులు నడిచే మార్గంలోని సిమెంట్ బ్లాకులు విరిగి గుంతలుగా మారాయి. వంతెన పిల్లర్ల వద్ద ఉన్న ఎక్స్‌పాన్షన్ జాయింట్లు పూర్తిగా దెబ్బతిని ప్రతి జాయింట్ వద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. వర్షాకాలంలో ఇవి నీటితో నిండిపోవడంతో ప్రమాదం మరింత పెరుగుతోంది.
వాహనదారులకు నరకయాతన
వంతెనపై ఏర్పడిన గుంతల కారణంగా ఆర్టీసీ బస్సులు తీవ్రంగా కుదుపులకు గురవుతున్నాయి. ద్విచక్ర వాహనదారులు గుంతలు తప్పించుకునే ప్రయత్నంలో అదుపు తప్పి పడిపోతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయని గ్రామస్థులు చెబుతున్నారు. ఆటోలు పలుమార్లు అదుపు తప్పి ప్రమాదాలకు గురైన సంఘటనలు జరిగినట్లు స్థానికులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో గుంతలు కనిపించకపోవడంతో ప్రమాదం మరింత ఎక్కువగా ఉంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామ పెద్దలు అప్పుడప్పుడు వారి స్వంత ఖర్చులతో మరమ్మత్తులు నిర్వహించడం, మళ్లీ దెబ్బ తినటం యధావిధి అయింది. బ్రిడ్జిపై పడిన గుంటలు మరమ్మత్తులు చేయాలంటే మరమ్మత్తులు చేసి దానిపై తారుతో పట్టి వేస్తే గాని నిలబడదని గ్రామ ప్రజలు అంటున్నారు.

30 గ్రామాలకు కీలక మార్గం
ఈ వంతెన పసుమర్రు గ్రామానికే కాకుండా అన్నంబొట్లవారి పాలెం, ఈ ఊరు వారి పాలెం, పర్చూరు, చీరాల, వింజనంపాడు, గుదేవారిపాలెం, అనంతరం తదితర ప్రాంతాలతో పాటు దాదాపు 30 గ్రామాల ప్రజలకు కీలక రాకపోకల మార్గంగా ఉంది. పర్చూరు, చీరాల వైపు వెళ్లే అనేక వాహనాలు కూడా ఇదే మార్గాన్ని వినియోగిస్తున్నాయి. ఇంతటి ప్రాధాన్యం ఉన్న వంతెనను అధికారులు పట్టించుకోకపోవడంపై ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
నిర్వహణ బాధ్యత ఎవరిది..?
వంతెన నిర్వహణ బాధ్యత ఏ శాఖదనే విషయంలో ప్రజల్లో అయోమయం నెలకొంది. నిర్మాణం పూర్తయిన తర్వాత సంబంధిత శాఖలు క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించి, అవసరమైన మరమ్మతులు చేపట్టాల్సి ఉన్నప్పటికీ ఆ దిశగా చర్యలు కనిపించడం లేదని గ్రామస్థులు విమర్శిస్తున్నారు. కోట్లాది రూపాయల ప్రజాధనంతో నిర్మించిన వంతెన నిర్వహణలో నిర్లక్ష్యం వల్ల అది శిధిలావస్థకు చేరుకోవడం విచారకరమని అంటున్నారు.
మరో వంతెన పరిస్థితీ అదే
చిలకలూరిపేట గడియార స్తంభం నుంచి బ్రహ్మంగారి గుడి మీదుగా ఓగేరు వాగుపై నిర్మించిన కొత్త వంతెన కూడా ఇప్పటికీ పూర్తిస్థాయిలో ప్రజలకు అందుబాటులోకి రాలేదని స్థానికులు పేర్కొంటున్నారు. నిర్మాణం పూర్తై సంవత్సరాలు గడిచినా అప్రోచ్ రోడ్లు పూర్తి కాలేదని, వంతెనపై వీధి దీపాలు ఏర్పాటు చేయలేదని చెబుతున్నారు. దీంతో ఆ వంతెన ప్రయోజనం ప్రజలకు పూర్తిగా అందడం లేదని విమర్శిస్తున్నారు.
తక్షణ చర్యలు చేపట్టాలి
పసుమర్రు వంతెనతో పాటు నియోజకవర్గంలోని అన్ని వంతెనలను సంబంధిత అధికారులు వెంటనే సాంకేతికంగా పరిశీలించాలని, ప్రమాదకరంగా మారిన గుంతలను పూడ్చి ఎక్స్‌పాన్షన్ జాయింట్లను మరమ్మతు చేయాలని, దెబ్బతిన్న పాదచారుల మార్గాన్ని పునర్నిర్మించాలని, అవసరమైతే ప్రత్యేక నిధులు కేటాయించి వంతెనలను బలోపేతం చేయాలని ప్రజలు కోరుతున్నారు. ప్రమాదం జరిగాక స్పందించడం కంటే ముందస్తు చర్యలు తీసుకుని ప్రజల ప్రాణాలను కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ప్రజా ప్రయోజనాల దృష్ట్యా సంబంధిత అధికారులు స్పందించి పసుమర్రు వంతెనతో పాటు నియోజకవర్గంలోని ఇతర వంతెనల పరిస్థితిపై సమగ్ర తనిఖీలు నిర్వహించి అవసరమైన మరమ్మతులు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
