ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై సీఎం స్పందించాలి..

  • ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల ప‌రిష్కారం వైపు అడుగులు వేయాలి
  • పీఆర్‌సీ క‌మిష‌న్‌ను నియ‌మించి, ఐఆర్‌ను ప్ర‌క‌టించాలి
  • పెండింగ్ డీఏల‌ను త‌క్ష‌ణ‌మే మంజూరు చేయాలి
  • ఏపీ జేఏసీ నేత‌లు ఎ.విద్యాసాగర్, కె.ఎస్.ఎస్.ప్రసాద్

(విజయవాడ, ఆంధ్రప్రభ) : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్లకు సంబంధించిన పెండింగ్ సమస్యల పరిష్కారంపై గౌర‌వ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తక్షణమే చొరవ చూపాలని, ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లపై ప్రభుత్వం సానుకూల నిర్ణయాలు తీసుకోవాలని ఏపీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు ఎ. విద్యాసాగర్, సెక్రటరీ జనరల్ కె.ఎస్.ఎస్. ప్రసాద్ కోరారు. శనివారం విజయవాడలోని ఏపీ ఎన్జీవో హోంలో ఎ. విద్యాసాగర్ అధ్యక్షతన నిర్వహించిన ఏపీ జేఏసీ రాష్ట్ర కార్య‌వ‌ర్గ సమావేశంలో నేత‌లు ఉద్యోగుల స‌మ‌స్య‌ల ప‌రిష్కార కార్యాచ‌ర‌ణ‌పై సుదీర్ఘంగా చ‌ర్చించారు. ఈ సందర్భంగా ఎ. విద్యాసాగర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న కీలక సమస్యలు ఇప్పటికీ పరిష్కారం కాకపోవడం ఆందోళన కలిగిస్తోందన్నారు.

వేత‌న స‌వ‌ర‌ణ జ‌రిగి ఇప్ప‌టికే ఎనిమిదేళ్లు దాటిపోయింద‌ని.. గ‌త ప్ర‌భుత్వం నియ‌మించిన పీఆర్‌సీ క‌మిష‌న్ రాజీనామా చేసి రెండేళ్లకు పైగా గ‌డిచిన‌ప్ప‌టికీ ప్ర‌స్తుత ప్ర‌భుత్వం క‌మిష‌న్‌ను నియ‌మించ‌క‌పోవ‌డం ఉద్యోగుల‌ను తీవ్ర‌నిరాశ‌కు గురిచేస్తోంద‌న్నారు. త‌క్ష‌ణ‌మే పీఆర్‌సీ క‌మిష‌న్‌ను నియ‌మించి ఐఆర్ ప్ర‌క‌టించాల్సిన బాధ్య‌త ప్ర‌భుత్వంపై ఉంద‌న్నారు. గ‌త ఏడాది కాలంగా ద్ర‌వ్యోల్బ‌ణం కార‌ణంగా నిత్యావ‌స‌రాల ధ‌ర‌లు అనూహ్యంగా పెరిగిపోయాయ‌న్నారు. ఆర్థిక క‌ష్టాల నుంచి ఉద్యోగుల‌కు ఉప‌శ‌మ‌నం క‌లిగించేది డీఏ, హెచ్ఆర్ఏలు మాత్ర‌మేన‌న్నారు. ఇప్ప‌టివ‌ర‌కు అయిదు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయ‌ని.. ఈ ప‌రిస్థితుల్లో ఉద్యోగులు ఆర్థిక ఇబ్బందుల‌కు గురువుతున్నార‌న్నారు.

గ‌త ప్ర‌భుత్వం ఉద్యోగుల‌ను తీవ్ర నిర్లక్ష్యం చేసింద‌ని.. కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డ్డాక బ‌కాయిలు చెల్లింపులో కొంత ఊర‌ట ల‌భించ‌డం, ఒక‌టో తేదీన వేత‌నాలు చెల్లించ‌డం వంటివి సానుకూలంగా ఉన్న‌ప్ప‌టికీ ఉద్యోగులకు న్యాయంగా రావాల్సిన ఆర్థిక ఫ‌లాలు అంద‌క‌పోవ‌డంతో ఉద్యోగ వ‌ర్గాల్లో అసంతృప్తి వ్య‌క్త‌మ‌వుతోంద‌న్నారు. ఏపీ జెఎసి ప్రభుత్వానికి 26 జూలై 2027 లోపు స్పందించాలని లేనిపక్షంలో 26 జూలై 2027న ఏపీ జేఏసీ సమావేశం ఏర్పాటు చేసుకొని భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామని తెలియజేయడం జరిగినదిని.. 01 జూలై 2026 నుండి 10 జూలై 2026 రాష్ట్రంలోని ప్రజాప్రతినిధులందరికీ వినతి పత్రాలు ఇచ్చే కార్యక్రమాలు మండల స్థాయి వరకు జరిగిందని తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం స్పందించి, 22న మంత్రుల సమావేశం ఏర్పాటు చేసిందని, మంత్రుల కమిటీ చాలా సానుకూలమైన వాతావరణంలో చర్చలు సాగించారని, ఆగస్టు ఒకటవ తేది తర్వాత ముఖ్యమంత్రి గారి తో చర్చించి మరియొక సమావేశంలో సానుకూల నిర్ణయాలు ప్రకటిస్తామని తెలిపారు. ఈ ప‌రిస్థితుల్లో రాష్ట్ర ముఖ్య‌మంత్రి సాధ్య‌మైనంత త్వ‌ర‌గా ఉద్యోగ సంఘాల నేత‌ల‌తో స్వ‌యంగా ప్ర‌త్యేక స‌మావేశం ఏర్పాటుచేసి డిమాండ్ల ప‌రిష్కారానికి రూట్‌మ్యాప్ ప్ర‌క‌టించాల‌ని విజ్ఞ‌ప్తి చేస్తున్న‌ట్లు విద్యాసాగ‌ర్ అన్నారు. పొరుగు రాష్ట్రం తెలంగాణ ప్రభుత్వం మూడు సంవత్సరాల క్రితమే వేతన సవరణ ప్రక్రియను ప్రారంభించి, పీఆర్సీ కమిటీని నియమించడంతో పాటు ఉద్యోగులకు మధ్యంతర భృతి (ఐఆర్) కూడా ప్రకటించిందన్నారు.

ప్రస్తుతం అక్కడ పీఆర్సీ ప్రక్రియ తుది దశకు చేరుకుని, త్వరలోనే కొత్త వేతన సవరణను అమలు చేసే పరిస్థితి ఉందని పేర్కొన్నారు. అయితే ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికీ 12వ పీఆర్సీ కమిషన్ నియామకం, మధ్యంతర భృతి (ఐఆర్) ప్రకటన వంటి కీలక అంశాల్లో ఎలాంటి కదలిక లేకపోవడం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో తీవ్ర నిరాశ, అసంతృప్తికి దారితీస్తోందని పేర్కొన్నారు. ఈ అంశాన్ని పలుమార్లు రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారుల దృష్టికి అత్యంత బాధ్యతాయుతంగా తీసుకెళ్లి, ఉద్యోగుల ఆందోళనలు, ఆకాంక్షలను వివరించినప్పటికీ ఇప్పటివరకు స్పష్టమైన నిర్ణయం వెలువడలేదని అన్నారు.

పొరుగు రాష్ట్రం తెలంగాణలో వేతన సవరణ ప్రక్రియ వేగంగా ముందుకు సాగుతున్న నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇకపై జాప్యం చేయకుండా పీఆర్సీ కమిషన్‌ను నియమించి, మధ్యంతర భృతి ప్రకటించడం ద్వారా ఉద్యోగులకు భరోసా కల్పించాలని ఆయన కోరారు. జేఏసీ సెక్ర‌ట‌రీ జ‌న‌ర‌ల్ కేఎస్ఎస్ ప్ర‌సాద్ మాట్లాడుతూ ఉద్యోగుల స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి ఏపీ జేఏసీ ప్ర‌భుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చిన ద‌రిమిలా మంత్రివ‌ర్గ బృందం ఉద్యోగ‌సంఘాల నేత‌ల‌తో స‌మావేశం ఏర్పాటుచేయ‌డం జ‌రిగింద‌ని.. ఉద్యోగుల డిమాండ్ల‌పై స‌మావేశంలో సానుకూల స్పంద‌న వ‌చ్చింద‌ని, త్వ‌ర‌లో ముఖ్య‌మంత్రితో స‌మావేశం ఏర్పాటుచేసి స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రిస్తామ‌ని మంత్రుల బృందం హామీ ఇచ్చింద‌న్నారు.

ఉద్యోగుల స‌మ‌స్య‌ల ప‌ట్ల జేఏసీ స‌మావేశంలో తీసుకున్న నిర్ణ‌యాల‌ను ప్ర‌భుత్వం ముందుంచి ప‌రిష్కారం వైపు అడుగులు వేసేలా కృషిచేస్తామ‌న్నారు. ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణ ప్రభావం నుంచి ఉద్యోగులను రక్షించేందుకు రాజ్యాంగబద్ధంగా అమలులో ఉన్న కాంపెన్సేటరీ మెకానిజంలో భాగంగానే ప్రతి ఆరు నెలలకు ఒకసారి డీఏను ప్రకటించే విధానం ఉందని వివరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కొనుగోలు శక్తి తగ్గిపోకుండా, జీవన వ్యయ సూచీలో నమోదయ్యే పెరుగుదలకు అనుగుణంగా డీఏలను పెంచే వ్యవస్థ ఎన్నో దశాబ్దాలుగా అమలులో ఉందన్నారు. ప్ర‌భుత్వం నుంచి స్పంద‌న లేకుంటే మ‌రోసారి రాష్ట్ర విష్కృత స్థాయి జేఏసీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసి త‌దుప‌రి కార్యాచ‌ర‌ణ‌పై నిర్ణ‌యం తీసుకుంటామ‌న్నారు.

స‌మావేశంలో డి.వి.రమణ ( ఎ.పీ.ఎన్జీజివోస్), డి.వెంకటేశ్వర్లు (పెన్షనర్స్), ఎల్.సాయి శ్రీనివాస్ (ఎస్‌టీయూ), జి.హృదయ రాజు (ఏపీటీఎఫ్), ఎ.సాంబశివరావు (పబ్లిక్ సెక్టార్), సి.హెచ్. మంజుల (ఏపీటీఎఫ్), ఎం. కృష్ణయ్య (పీఆర్‌టీయూ), కె. శ్రీనివాసరాజు (పీపీటీడీ మజ్దూర్ యూనియన్), ఎన్. చంద్రశేఖర్ (క్లాస్-IV), పి.వి. సాయి కుమార్ (వ్యవసాయ), ఆర్. మధుకర్ బాబు (రవాణా శాఖ), జి.వెంకటరెడ్డి (పంచాయతీరాజ్ డిప్లొమా), పాము శ్రీనివాసరావు (ట్రెజరీ సర్వీసెస్), ఎస్. రాధమ్మ (ప్రభుత్వ నర్సులు), పి.రమేష్ (ఇరిగేషన్ ఎన్‌జీఓస్), వై.వి.డి. ప్రసాద్ (పంచాయతీ కార్యదర్శులు), ఆర్.ఎస్. హరనాథ్ (పే అండ్ అకౌంట్స్), బి. నరసింహులు (ఎక్సైజ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్), బి.వెంకటేష్ బాబు (కమర్షియల్ టాక్సెస్), ఎస్.ఎల్. సోమయాజులు (టెక్నికల్ ఆఫీసర్స్), టి. కృష్ణ కిషోర్ (ఐటీఐ & డీఎల్టీసీ స్టాఫ్ అసోసియేషన్), వి. రవి (జూనియర్ లెక్చరర్స్), జానీ పాషా షేక్ (గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులు), సి.మారియా దాసు (ఏపీసీపీఎస్‌ఈఏ), కె. ప్రకాశ్ రావు (ప్రాథమిక ఉపాధ్యాయులు), ఎస్‌కే. సుభాని (వ్యవసాయ విస్తరణ అధికారులు), సయ్యద్ వాజిద్ రేహాన్ (ఇరిగేషన్, ఆర్&బీ, పీఆర్, ఆర్‌డబ్ల్యూఎస్), పి.క్రాంతి కుమారి (మహిళా & శిశు సంక్షేమ ఉద్యోగులు), జి.రామకృష్ణ (నాన్-గ్రాడ్యుయేట్ వెటర్నరీనరియన్స్ ఫెడరేషన్) తదితరులు పాల్గొన్నారు.