ప్రొఫెసర్ నాగేశ్వర్‌పై దాడులు ఖండించాలి

ప్రొఫెసర్ నాగేశ్వర్‌పై దాడులు ఖండించాలి

– కేసులు వెంటనే ఎత్తివేయాలి: బత్తుల సోమయ్య

ఖమ్మం, ఆంధ్రప్రభ : వాక్స్వాతంత్ర్యం రాజ్యాంగం కల్పించిన హక్కు అని, ప్రొఫెసర్ నాగేశ్వర్‌పై ఆంధ్ర పోలీసుల దౌష్టికాన్ని ఖండిస్తున్నామని తెలంగాణ తొలి మలిదశ ఉద్యమకారుడు బత్తుల సోమయ్య అన్నారు. ప్రొఫెసర్ నాగేశ్వర్‌పై నమోదైన కేసులు వెంటనే ఎత్తివేయాలని, పవన్ కళ్యాణ్ బేషరతుగా ప్రొఫెసర్‌కు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. లేకుంటే తెలంగాణలో తిరగనివ్వమని హెచ్చరించారు.

ఖమ్మంలో మే 28న ఆయన మాట్లాడుతూ.. ఏ విషయంపైనైనా మాట్లాడే స్వేచ్ఛ భారత రాజ్యాంగం కల్పించిందని తెలిపారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ మాట్లాడిన మాటల్లో ఎలాంటి తప్పు లేదని అన్నారు. ఒక మేధావిగా, ప్రొఫెసర్‌గా, జర్నలిస్టుగా, అనలిస్ట్‌గా ఆయనకు ఉన్న సమాచారం మేరకే వ్యాఖ్యలు చేసి ఉండవచ్చని పేర్కొన్నారు.

అందులో నిజం లేకపోతే మాట్లాడి ఉండరని సోమయ్య అభిప్రాయపడ్డారు. అనేక అంశాలపై ఆయన తన అభిప్రాయాలను వెల్లడించారని, ఇప్పుడు కావాలనే ఆయన మాటలను వక్రీకరించి సోషల్ మీడియాలో దాడి చేస్తున్నారని విమర్శించారు. మేధావులను బెదిరించే ప్రయత్నాలు జరిగితే రానున్న రోజుల్లో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ ఏ పార్టీకి చెందిన వ్యక్తి కాదని, ఉన్నది ఉన్నట్లుగా సైంటిఫిక్‌గా తన అభిప్రాయాలు వెల్లడిస్తారని తెలిపారు.

ఆంధ్ర సోషల్ మీడియా, ఆంధ్ర నాయకులు దాడులు చేస్తామంటే తెలంగాణ ప్రజలు ఊరుకోరని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 ఏళ్లు గడిచినా ఇంకా వలసవాద ఆంధ్ర ఆధిపత్య ధోరణి కొనసాగుతోందని ఆరోపించారు. మేధావులు, విద్యార్థులు, తెలంగాణ ప్రజలు ఏకమై ఇలాంటి పెత్తందారులపై గళం వినిపించాలని పిలుపునిచ్చారు.

Leave a Reply