గుడుంబా తయారీకి తరలిస్తున్న నల్లబెల్లం పట్టివేత

గుడుంబా తయారీకి తరలిస్తున్న నల్లబెల్లం పట్టివేత

తొర్రూరు, ఆంధ్రప్రభ:

గుడుంబా తయారీకి వినియోగించే నిషేధిత నల్లబెల్లాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్న ఘటన తొర్రూరు మండల పరిధిలో చోటుచేసుకుంది. ఎస్సై తోట మహేందర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం, రాజస్థాన్ రాష్ట్రంలోని బార్మేర్ జిల్లా కేకర్ గ్రామానికి చెందిన జాకర్ గణపతి కొంతకాలంగా మహబూబాబాద్‌లోని నర్సంపేట రోడ్డులో నివాసం ఉంటున్నాడు. ఎవరికి అనుమానం రాకుండా రైలింగ్ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు.

ఈజీ మనీకి అలవాటు పడిన గణపతి నల్లబెల్లం సరఫరా వ్యాపారం చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. కర్ణాటకలోని బీదర్ నుంచి నల్లబెల్లం కొనుగోలు చేసి, డోర్నకల్ మండల పరిధిలోని పలు తండాల్లో ఎక్కువ ధరకు విక్రయిస్తున్నట్లు చెప్పారు. ఈ క్రమంలో ఓ కారులో 17 బస్తాల నల్లబెల్లం, ఒక బస్తా పటిక తరలిస్తుండగా తొర్రూరు మండల శివారులోని పాల కేంద్రం వద్ద పోలీసులు పట్టుకున్నారు. కారును ఆపి తనిఖీ చేయగా 8.50 క్వింటాళ్ల నల్లబెల్లం, 50 కిలోల పటిక స్వాధీనమయ్యాయి.

వాటి విలువ రూ.93 వేల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.గుడుంబా తయారీ కోసం నల్లబెల్లం విక్రయాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు. అవసరమైతే పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలిస్తామని తెలిపారు. ఈ తనిఖీల్లో అదనపు ఎస్సై ఖాదర్ పాషా, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.