ఈనెల 21న కోటి మందితో యోగాంధ్ర..

ఈనెల 21న కోటి మందితో యోగాంధ్ర..

ప్రభుత్వ విప్ బెందాళం అశోక్

బారువా తీరాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేస్తాం: కలెక్టర్ స్వప్నిల్ దినకర్

సోంపేట, ఆంధ్రప్రభ: కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా యోగాంధ్ర కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నామని బెందాళం అశోక్ అన్నారు.

సోంపేట మండల పరిధిలోని బారువా బీచ్ తీరంలో మత్స్యకారుల థీమ్‌తో నిర్వహించిన ప్రత్యేక యోగా కార్యక్రమంలో ఆయన, స్వప్నిల్ దినకర్ పుండ్కర్తో కలిసి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా బెందాళం అశోక్ మాట్లాడుతూ, యోగా దేశానికి ఉన్న గొప్ప సంపద అని అన్నారు. యోగా ద్వారా మానసిక, శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుందని, ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా ముందుకు తీసుకెళ్తున్నారని తెలిపారు.

గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లక్ష్యంగా ఈనెల 21న రాష్ట్రంలో కోటి మందితో భారీ యోగా కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వెల్లడించారు. బారువా బీచ్ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. ఇక్కడ రెస్టారెంట్లు ఏర్పాటు చేసి స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు.

నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి పర్యాటక రంగాన్ని బలోపేతం చేయడం అవసరమని పేర్కొన్నారు.

జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మాట్లాడుతూ, ఆహ్లాదకరమైన బారువా సముద్రతీరంలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమన్నారు. ప్రస్తుతం దేశంలో 12 బ్లూ ఫ్లాగ్ బీచ్‌లు మాత్రమే ఉన్నాయని, 13వ బ్లూ ఫ్లాగ్ బీచ్‌గా బారువా సముద్రతీరాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయనున్నట్లు ప్రకటించారు.

ప్రపంచ పర్యాటకులను ఆకర్షించేలా బారువా ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు స్థానిక ఎమ్మెల్యేతో ఇప్పటికే చర్చించినట్లు తెలిపారు. బ్లూ ఫ్లాగ్ గుర్తింపు సాధించేందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు.

పర్యాటకులు, స్థానికులు సముద్రతీర పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. పరిశుభ్రత ప్రమాణాలు పాటించినప్పుడే బ్లూ ఫ్లాగ్ గుర్తింపు ప్రక్రియ వేగవంతం అవుతుందని పేర్కొన్నారు.

కార్యక్రమంలో ఫర్మాన్ అహ్మద్ ఖాన్, జిల్లా మత్స్యశాఖ ఉపసంచాలకులు సుమలత, జిల్లా ఆయుష్ అధికారి డాక్టర్ ఉత్తం రాజ్ రాణా పాల్గొన్నారు.

యోగ శిక్షకులు పాండ్రంకి మురళీకృష్ణ, కొంక్యాన మురళీధర్, పతంజలి యోగా గురువులు నాగలక్ష్మి, లక్ష్మి, గాయత్రి, ఆర్ట్ ఆఫ్ లివింగ్ గురువు కల్పన యోగా శిక్షణ అందించారు.

పెద్దమ్మ కోలాటం ట్రూప్‌కు చెందిన మేరుగు శారద శిష్యబృందం, శ్రీ నటరాజ నాట్య మండలికి చెందిన బిందు కామేశ్వరి శిష్యబృందం ప్రదర్శించిన కోలాటాలు, నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. బారువా, పరిసర గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *