కండ్లకోయలో వైభవంగా బొడ్రాయి వార్షికోత్సవం
కండ్లకోయలో వైభవంగా బొడ్రాయి వార్షికోత్సవం
మేడ్చల్, (ఆంధ్రప్రభ): సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేడ్చల్ సర్కిల్ గుండ్లపోచంపల్లి డివిజన్ పరిధిలోని కండ్లకోయ పట్టణంలో బొడ్రాయి ప్రతిష్ఠాపన 3వ వార్షికోత్సవ వేడుకలు గురువారం అత్యంత వైభవంగా, ఆధ్యాత్మిక వాతావరణంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ పెద్దల ఆధ్వర్యంలో కాలనీవాసులు, భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేశారు.
వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఉదయం నుంచే బొడ్రాయి వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. వేద పండితులు శాస్త్రోక్తంగా మంత్రోచ్ఛారణల మధ్య బొడ్రాయికి పంచామృతాభిషేకాలు, ప్రత్యేక అర్చనలు నిర్వహించారు. అనంతరం దేవతను పూలతో సుందరంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు.
ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న భక్తులకు, పట్టణ పెద్దలకు వేద పండితులు ఆశీర్వచనాలు అందించి తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పట్టణ పెద్దలు మాట్లాడుతూ, బొడ్రాయి అమ్మవారి కృపతో గుండ్లపోచంపల్లి డివిజన్ ప్రజలందరూ పాడిపంటలతో, సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ప్రత్యేకంగా ప్రార్థించినట్లు తెలిపారు.
పట్టణానికి ఎలాంటి దిష్టి, కీడు కలగకుండా, ప్రజలంతా ఐకమత్యంతో ప్రశాంతంగా జీవించాలని అమ్మవారిని వేడుకున్నట్లు పేర్కొన్నారు. కండ్లకోయలో జరిగిన ఈ ఉత్సవాలకు మహిళలు, యువకులు, వృద్ధులు స్వచ్ఛందంగా తరలివచ్చారు. మహిళలు సాంప్రదాయ దుస్తుల్లో పాల్గొని అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు.
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో కండ్లకోయ మాజీ సర్పంచ్ కందాడి నరేందర్ రెడ్డి, గుండ్లపోచంపల్లి మున్సిపల్ మాజీ కౌన్సిలర్ సముద్రాల హంసరాణి కృష్ణగౌడ్, రాజేందర్, తలారి వెంకటేష్, ఎంబీ రాజు, పెంటయ్య, శివ, శ్రీకాంత్, ప్రభాకర్, మహేందర్, బిక్షపతి, స్థానిక నాయకులు, వార్డు ప్రతినిధులు, పట్టణ ప్రముఖులు, పట్టణవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
