ప్రశాంతంగా ఎస్‌ఎస్‌సీ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు

ప్రశాంతంగా ఎస్‌ఎస్‌సీ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు

విజయవాడ, ఆంధ్రప్రభ : ఎన్‌టీఆర్ జిల్లాలో ఎస్‌ఎస్‌సీ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు సోమవారం ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. తొలి రోజు ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు పరీక్షను జిల్లా వ్యాప్తంగా 25 పరీక్ష కేంద్రాల్లో నిర్వహించినట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు.

మొత్తం 1,680 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా, 1,298 మంది హాజరయ్యారు. 382 మంది గైర్హాజరైనట్లు అధికారులు వెల్లడించారు. జిల్లాలో మొత్తం హాజరు శాతం 77.3గా నమోదైంది.

జిల్లా విద్యాశాఖాధికారి ఎల్. చంద్రకళ విజయవాడలోని కేబీసీ జడ్‌పీ బాలుర ఉన్నత పాఠశాల, పటమట, ఏకేటీపీ మున్సిపల్ ఉన్నత పాఠశాల, సత్యనారాయణపురం, జీఎస్‌ఆర్ మున్సిపల్ ఉన్నత పాఠశాల, ముత్యాలంపాడు, అపాస్ ఇంటర్ పరీక్ష కేంద్రాలను సందర్శించి నిర్వహణను పరిశీలించారు.

అదేవిధంగా జిల్లాలో ఏర్పాటు చేసిన మూడు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు 15 పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసి పరీక్షల నిర్వహణ తీరును సమీక్షించాయి. మొత్తం 20 పరీక్ష కేంద్రాలను అధికారులు పరిశీలించినట్లు సమాచారం.

జిల్లాలో ఏ పరీక్ష కేంద్రంలోనూ మాల్‌ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని అధికారులు స్పష్టం చేశారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసి తొలి రోజు పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించినట్లు విద్యాశాఖ వెల్లడించింది.