రైతు కుటుంబం నుంచి పీహెచ్‌డీ వరకు..

రైతు కుటుంబం నుంచి పీహెచ్‌డీ వరకు..

బొమ్మన్‌పల్లి యువ పరిశోధకుడికి డాక్టరేట్ పట్టా

అచ్చంపేట, ఆంధ్రప్రభ: నాగర్‌కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం బొమ్మన్‌పల్లి గ్రామానికి చెందిన యువ పరిశోధకుడు కొండె రామ్‌పాల్ ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ (పీహెచ్‌డీ) పట్టా పొందారు. గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చి ఉన్నత విద్యలో ప్రతిభ చూపిన ఆయన విజయం ఈ ప్రాంతానికి గర్వకారణంగా నిలిచింది.

కొండె చెన్న కిష్టయ్య కుమారుడైన రామ్‌పాల్ సాధారణ రైతు కుటుంబంలో జన్మించి, ఆరుగురు సోదరులతో కూడిన పెద్ద కుటుంబంలో పెరిగారు. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనప్పటికీ విద్యపై ఉన్న ఆసక్తితో ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ విద్యాసంస్థలలోనే తన విద్యాభ్యాసాన్ని పూర్తి చేశారు. చిన్ననాటి నుంచే ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగిన ఆయన పరిశోధనా రంగంలో ప్రత్యేక గుర్తింపు సాధించారు.

“బౌద్ధ జీవన విధానం: బౌద్ధములో నైతిక తత్వశాస్త్రంపై ఒక అధ్యయనం” అనే అంశంపై రామ్‌పాల్ సమగ్ర పరిశోధన నిర్వహించి డాక్టరేట్ పట్టా పొందారు. ఈ పరిశోధనను మాజీ శాతవాహన విశ్వవిద్యాలయ ఉపకులపతి, మాజీ ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ సంకశాల మల్లేష్ పర్యవేక్షణలో పూర్తి చేశారు.

ఈ పరిశోధనలో బౌద్ధ ధర్మంలోని నైతిక విలువలు, మానవతా దృక్పథం, సమానత్వ భావన, శాంతియుత జీవన విధానం, సమాజ నిర్మాణంలో బౌద్ధ తత్వశాస్త్ర ప్రాధాన్యత వంటి అంశాలను విశ్లేషించారు. ఆధునిక సమాజంలో బౌద్ధ నైతిక తత్వశాస్త్ర ప్రాసంగికతను ఈ అధ్యయనం స్పష్టంగా ప్రతిపాదించింది.