రైతు సమస్యలపై బీజేపీ ఆగ్రహం
రైతు సమస్యలపై బీజేపీ ఆగ్రహం
‘రైతులను ఇబ్బంది పెడితే ఊరుకోం’ – వల్లభు వెంకటేశ్వర్లు
కేసముద్రం, ఆంధ్రప్రభ: ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారి సమస్యలను పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వల్లభు వెంకటేశ్వర్లు విమర్శించారు.
తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ‘రైతు గోస – బీజేపీ భరోసా’ కార్యక్రమంలో భాగంగా సోమవారం కేసముద్రం మండలంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను బీజేపీ బృందం సందర్శించింది. ఈ సందర్భంగా కేసముద్రం మండల శాఖ అధ్యక్షుడు ఉప్పునూతల రమేష్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు వల్లభు వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
బీజేపీ నాయకుల బృందం కేసముద్రం ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి, అక్కడ పడిగాపులు కాస్తున్న రైతులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుంది. అనంతరం వల్లభు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఆరుగాలం కష్టపడి పండించిన పంటను విక్రయించేందుకు రైతులు వారాల తరబడి కొనుగోలు కేంద్రాల వద్ద నిరీక్షించాల్సి రావడం దుర్మార్గమని అన్నారు.
ముందస్తు ప్రణాళికల లోపం వల్ల గోనె సంచుల కొరత, రవాణా (లారీలు) సమస్యలు తీవ్రంగా ఉన్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తూకాల్లో జరుగుతున్న లోపాలు, తరుగు పేరుతో క్వింటాలుకు చేస్తున్న కోతలపై అధికారులను ఆయన నిలదీశారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు కనీస సౌకర్యాలు కూడా లేవని, ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ తాగునీరు, నీడ కోసం షెడ్లు, టార్పాలిన్లు ఏర్పాటు చేయకపోవడం దారుణమని ఆయన పేర్కొన్నారు.
రైతులకు పూర్తి స్థాయిలో కనీస వసతులు కల్పించి కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రైతులకు న్యాయం జరిగే వరకు బీజేపీ క్షేత్రస్థాయిలో పోరాటం కొనసాగిస్తుందని ఆయన భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు పొదిల నరసింహ రెడ్డి, మండల మున్సిపల్ కన్వీనర్ బోగోజు నాగేశ్వర చారి, మంగిశెట్టి నాగన్న, మల్యాల రాములు, పోలేపల్లి సంపత్ రెడ్డి, బానోత్ రాము, వెం సుదీష్తో పాటు పలువురు బీజేపీ మండల నాయకులు పాల్గొన్నారు.
