ఇంటింటికీ చేరిన భరోసా… లబ్ధిదారులతో కలెక్టర్ మమేకం

ఏలూరు బ్యూరో, ఆంధ్రప్రభ: రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు ఆర్థిక భరోసా కల్పించడంలో అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, పింఛన్లను సద్వినియోగం చేసుకుని జీవన ప్రమాణాలను మరింత మెరుగుపరుచుకోవాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి సూచించారు.

స్థానిక శనివారపుపేట-1లోని మంచినీళ్లవారి వీధిలో సోమవారం ఎన్టీఆర్ సామాజిక భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్, ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారులకు స్వయంగా పింఛన్ నగదును అందజేశారు. వారిని ఆప్యాయంగా పలకరిస్తూ ఆరోగ్య పరిస్థితులు, జీవన విధానం గురించి అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ప్రతి రోజు చెత్త సేకరణ కోసం పంచాయతీ సిబ్బంది ఇంటింటికీ వస్తున్నారా అని లబ్ధిదారులను ప్రశ్నించారు. చెత్త సేకరణ సక్రమంగానే జరుగుతోందని, అయితే డ్రైనేజీ మురుగు సరిగా పారడం లేదని వారు చెప్పడంతో వెంటనే సమస్యను పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజలు ఏవైనా సమస్యలు ఎదుర్కొంటే టోల్ ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు.

జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి మాట్లాడుతూ, పింఛన్ సొమ్మును జాగ్రత్తగా వినియోగించుకోవడంతో పాటు భవిష్యత్తు అవసరాల కోసం కొంత మొత్తాన్ని పొదుపు చేసుకోవాలని సూచించారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రతిరోజూ కొంతసేపు నడక వంటి మంచి అలవాట్లు అలవరచుకోవాలని చెప్పారు.

జిల్లా వ్యాప్తంగా సోమవారం 2,55,816 మంది లబ్ధిదారులకు రూ.113.29 కోట్ల పింఛన్ మొత్తాన్ని పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. సాయంత్రానికి నూరుశాతం పంపిణీ పూర్తయ్యేలా అన్ని చర్యలు చేపట్టామని చెప్పారు. అనివార్య కారణాలతో సోమవారం పింఛన్ తీసుకోలేని వారికి జూన్ 2న పంపిణీ చేస్తామని వివరించారు.

జిల్లాలో 4,959 మంది స్వర్ణగ్రామ, స్వర్ణవార్డు సచివాలయ ఉద్యోగులు, ఇతర ప్రభుత్వ సిబ్బంది పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటున్నారని, వేగవంతంగా ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు.

కార్యక్రమంలో ఆర్డీవో కె. లక్ష్మీప్రసన్న, డీఆర్‌డీఏ పీడీ టి.వి. విజయలక్ష్మి, తహసీల్దార్ కె. గాయత్రీదేవి, రెవెన్యూ, గ్రామ పంచాయతీ, స్వర్ణగ్రామ సిబ్బంది, స్థానిక నాయకులు పాల్గొన్నారు.