ఈ విచిత్ర వేషధారణ వెనుక రహస్యం ఏంటి?

ఈ విచిత్ర వేషధారణ వెనుక రహస్యం ఏంటి?

ఆంధ్రప్రభ, వెబ్​ డెస్క్​ : ఏడు రోజుల పాటు విచిత్ర వేషధారణలు.. భక్తుల నోట బూతుల తిట్లు.. పురుషు సైతం మహిళ్ల చీరలు కట్టుకొని మొక్కలు చెల్లించుకునే వింత సంప్రదాయం. అవును తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతరలో మాత్రమే కనిపించే అరుదైన దృశ్యాలు ఇవి.. అసలు శ్రీవారి చెల్లెలికి ఈ జాతర ఎందుకు చేస్తారు. అసలు ఆ ఏడు వేషల వెనుక ఉన్న రహస్యం ఏంటి ఆలయ విశిష్టత గురించి తెలుసుకుందాం పదండి…

తిరుమల శ్రీవారికి చెల్లెలు, తిరుపతి గ్రామదేవత తాతయ్యగుంట గంగమ్మ జాతర అంటేనే ఒక వైభవం. ఏటా మే నెలలో అత్యంత ఘనంగా జరిగే ఈ జాతర, కేవలం భక్తికి మాత్రమే కాదు.. అద్భుతమైన జానపద సంప్రదాయాలకు కూడా నిలయం. 2026 ఏడాదికి గానూ మే 5వ తేదీన ప్రారంభమైన ఈ వేడుకలు ప్రస్తుతం పతాక స్థాయికి చేరుకున్నాయి.

900 ఏళ్ల చారిత్రక నేపథ్యం..
సుమారు 900 ఏళ్ల క్రితం తిరుపతి పరిసర ప్రాంతాలను ఒక దుష్ట పాలెగాడు పాలించేవాడు. స్త్రీల పట్ల అత్యంత క్రూరంగా ప్రవర్తించే ఆ మృగాన్ని అంతం చేయడానికి జగన్మాత గంగమ్మగా అవతరించింది. గంగమ్మ సౌందర్యానికి ముగ్ధుడైన పాలెగాడు ఆమెను దక్కించుకోవాలని ప్రయత్నించగా, ఆమె విశ్వరూపం దాల్చింది. భయంతో పాలెగాడు అడవుల్లో దాక్కున్నాడు. వాడిని బయటకు రప్పించేందుకు గంగమ్మ ఏడు రోజుల పాటు రకరకాల వేషాలు వేసి, చివరకు మాతంగి వేషంలో సంహరించింది. ఆ విజయానికి గుర్తుగానే ఈ జాతర నిర్వహిస్తారు.

ఏడు రోజుల ఏడు వేషాలు
ఈ జాతరలో భక్తులు ధరించే వేషధారణలు ప్రధాన ఆకర్షణ.
చాటింపు: జాతర ప్రారంభాన్ని సూచిస్తూ అర్ధరాత్రి నగరం అంతా చాటింపు వేస్తారు.
బైరాగి వేషం: భక్తులు ఒంటికి తెల్లటి నామం పూసుకుని, రేగు పండ్ల దండలు ధరించి అమ్మవారిని దర్శించుకుంటారు.
బండ వేషం: శరీరం అంతా కుంకుమ రంగు పూసుకుని భీకరంగా కనిపిస్తారు.
తోటి వేషం: బొగ్గు పొడిని ఒంటికి పూసుకుని వినూత్నంగా పూజలు చేస్తారు.
దొర వేషం: చందనం పూత పూసుకుని పాలెగాడి వేషధారణలో భక్తులు అలరిస్తారు.
మాతంగి వేషం: గిరిజన మహిళల రూపంలో భక్తులు వేషాలు వేస్తారు.
సున్నపు కుండల వేషం: తెల్లటి సున్నం పూసుకుని, నెత్తిన సున్నపు కుండలు పెట్టుకుని అమ్మవారికి మొక్కులు చెల్లిస్తారు.
ప్రధాన జాతర (సాపరం): ఇది అత్యంత ముఖ్యమైన రోజు. తిరుమల శ్రీవారి తరపున పసుపు, కుంకుమ, చీర (శ్రీవారి సారె) గంగమ్మకు సమర్పిస్తారు.
విశ్వరూప దర్శనం: తెల్లవారుజామున 4 గంటలకు మట్టితో చేసిన గంగమ్మ భారీ విగ్రహాన్ని (విశ్వరూపం) భగ్నం చేస్తారు. ఆ మట్టిని ప్రసాదంగా భక్తులు స్వీకరిస్తారు.

జాతరలోని ప్రత్యేక ఆకర్షణలు…
బూతు తిట్లు: పాలెగాడిని బయటకు రప్పించేందుకు నాడు ప్రజలు చేసిన హేళనలే నేడు తిట్ల సంప్రదాయంగా మారాయి. భక్తులు అమ్మవారిని తిడుతూ తమ భక్తిని చాటుకోవడం ఇక్కడి వింత ఆచారం.
పురుషుల స్త్రీ వేషధారణ: పాలెగాడిని భ్రమింపజేయడానికి నాడు పురుషులు స్త్రీ వేషాలు వేశారు. అదే సంప్రదాయాన్ని పాటిస్తూ నేటికీ చాలా మంది పురుషులు చీరలు కట్టుకుని మొక్కులు తీర్చుకుంటారు.
మట్టి ప్రసాదం: జాతర ముగింపులో లభించే ఆ మట్టిని ఇంట్లో ఉంచుకుంటే దుష్ట శక్తులు దరిచేరవని భక్తుల ప్రగాఢ విశ్వాసం.

Leave a Reply