చిత్తూరు జిల్లాలో మెడికల్ షాపుల బంద్ విజయవంతం
చిత్తూరు జిల్లాలో మెడికల్ షాపుల బంద్ విజయవంతం
చిత్తూరు, మే(ఆంధ్రప్రభ బ్యూరో) : ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ పిలుపు మేరకు బుధవారం చిత్తూరు జిల్లాలో మెడికల్ షాపుల బంద్ విజయవంతంగా కొనసాగింది. జిల్లాలోని పట్టణాలు, మండల కేంద్రాల్లో అధిక సంఖ్యలో మెడికల్ షాపులు మూతపడగా, చిత్తూరు పట్టణంలో దాదాపు అన్ని ఔషధ దుకాణాలు బంద్‌లో పాల్గొన్నాయి. బంద్ సందర్భంగా చిత్తూరు జిల్లా కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పట్టణంలో ర్యాలీ నిర్వహించి గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పి. నరేష్ బాబు విలేకరులతో మాట్లాడుతూ, తమ సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమ ఈ-ఫార్మసీల కార్యకలాపాలు, కార్పొరేట్ కంపెనీల భారీ డిస్కౌంట్ విధానాలు చిన్న మెడికల్ షాపుల మనుగడకు ముప్పుగా మారాయని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు అత్యవసర సమయాల్లో సేవలు అందిస్తున్న చిన్న మెడికల్ షాపులు ఆర్థిక ఇబ్బందులతో మూతపడే పరిస్థితి వస్తోందని తెలిపారు. ఆన్లైన్ ఫార్మసీల ద్వారా వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండానే మందులు విక్రయించడం ప్రమాదకరమని నరేష్ బాబు పేర్కొన్నారు.
ముఖ్యంగా యాంటీబయాటిక్స్ వంటి మందులు ఎలాంటి నియంత్రణలు లేకుండా ప్రజలకు అందుబాటులోకి రావడం వల్ల భవిష్యత్తులో ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం పడే అవకాశముందని హెచ్చరించారు. మందులు సాధారణ వస్తువులు కావని, అవి ప్రజల ప్రాణాలతో నేరుగా సంబంధం ఉన్నవని చెప్పారు. రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ పర్యవేక్షణలోనే మందులు విక్రయించాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన జీఎస్ఆర్ 817(ఈ), జీఎస్ఆర్ 220(ఈ) నోటిఫికేషన్లను ఉపసంహరించుకోవాలని అసోసియేషన్ డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. కోవిడ్ సమయంలో తీసుకొచ్చిన కొన్ని నిబంధనలు ఇప్పటికీ కొనసాగుతుండటంతో వాటి దుర్వినియోగం పెరుగుతోందని ఆరోపించారు. డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ చట్టంలోని భద్రతా ప్రమాణాలను కచ్చితంగా అమలు చేయాలని కోరారు. భారీ పెట్టుబడులతో కార్పొరేట్ కంపెనీలు మార్కెట్‌ను ఆక్రమిస్తున్నాయని, చిన్న వ్యాపారులు అద్దెలు, విద్యుత్ చార్జీలు, సిబ్బంది జీతాలు చెల్లిస్తూ వ్యాపారం కొనసాగించడం కష్టమవుతోందని తెలిపారు. ప్రభుత్వం తక్షణం జోక్యం చేసుకుని చిన్న మరియు మధ్య తరహా మెడికల్ షాపులను రక్షించే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఈ బంద్ తమ వ్యాపార ప్రయోజనాల కోసమే కాదని, ప్రజారోగ్య రక్షణ కోసం కూడా చేస్తున్న పోరాటమని నరేష్ బాబు స్పష్టం చేశారు. పలుమార్లు ప్రభుత్వానికి వినతిపత్రాలు సమర్పించినప్పటికీ సరైన స్పందన రాకపోవడంతో దేశవ్యాప్త ఆందోళనకు దిగాల్సి వచ్చిందన్నారు. భవిష్యత్తులో సమస్యలు పరిష్కరించకపోతే మరింత తీవ్ర ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కె. బాబు నాయుడు, కోశాధికారి రాజప్ప శెట్టి, చిత్తూరు పట్టణ కెమిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు దేవదాసు, ప్రధాన కార్యదర్శి మోహన్ రెడ్డి, కోశాధికారి చంద్రమోహన్ రెడ్డితో పాటు జిల్లా, పట్టణ స్థాయి నాయకులు, మెడికల్ షాపుల యజమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



