పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలి

పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలి
ఆటోకు తాడు కట్టి లాగుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వినూత్న నిరసన
గాంధీ విగ్రహం నుంచి ఆర్డీవో కార్యాలయం వరకు భారీ ర్యాలీ
చిత్తూరు, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ చిత్తూరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. చిత్తూరు నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త ఎంసీ విజయానంద రెడ్డి నాయకత్వంలో జరిగిన ఈ నిరసనలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపిస్తూ పార్టీ నాయకులు వినూత్నంగా ఆటోరిక్షాకు తాడు కట్టి లాగుతూ నిరసన తెలిపారు. పెరిగిన ఇంధన ధరలతో ఆటో కార్మికులు, మధ్యతరగతి కుటుంబాలు, రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

చిత్తూరు నగరంలోని గాంధీ విగ్రహం వద్ద ప్రారంభమైన నిరసన ర్యాలీ పట్టణ ప్రధాన వీధుల గుండా ఆర్డీవో కార్యాలయం వరకు కొనసాగింది. చేతుల్లో ప్లకార్డులు, పార్టీ జెండాలతో నినాదాలు చేస్తూ కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. “పెంచిన ధరలు తగ్గించాలి”, “ప్రజలపై భారం మోపొద్దు”, “బాదుడే బాదుడు ప్రభుత్వం గద్దె దించాలి” అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆర్డీవో కార్యాలయానికి చేరుకున్న అనంతరం ఎంసీ విజయానంద రెడ్డి ఆధ్వర్యంలో ప్రతినిధి బృందం చిత్తూరు ఆర్డీవోకు వినతిపత్రం అందజేసింది. పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరల పెంపును వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు.

ఈ సందర్భంగా ఎంసీ విజయానంద రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలపై భారం మరింత పెరిగిందని విమర్శించారు. ఎన్నికల సమయంలో “బాదుడే బాదుడు” అంటూ ప్రజల సమస్యలను ప్రస్తావించిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు అదే ప్రజలపై ధరల భారం మోపుతున్నారని మండిపడ్డారు. యువగళం పాదయాత్ర సమయంలో నారా లోకేష్ కర్ణాటక రాష్ట్ర సరిహద్దులో సెల్ఫీ దిగుతూ అక్కడి పెట్రోల్, డీజిల్ ధరలను ఆంధ్రప్రదేశ్‌తో పోల్చి విమర్శలు చేశారని గుర్తుచేశారు. అప్పుడు వ్యాట్ తగ్గించి ధరలు తగ్గిస్తామని హామీలు ఇచ్చారని, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాట తప్పి ఇంధన ధరలను మరింత పెంచారని ఆరోపించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు అధికంగా ఉన్నాయని విజయానంద రెడ్డి విమర్శించారు. తమిళనాడుతో పోలిస్తే ఇక్కడ పెట్రోల్ ధరలు దాదాపు రూ.8 ఎక్కువగా ఉన్నాయని, కర్ణాటకతో పోలిస్తే రూ.10 వరకు తేడా ఉందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పన్నుల భారమే దీనికి ప్రధాన కారణమని ఆరోపించారు. ఇంధన ధరల పెంపు ప్రభావం అన్ని రంగాలపైనా పడుతోందన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో రవాణా ఖర్చులు అధికమై నిత్యావసర సరుకుల ధరలు కూడా అమాంతం పెరిగిపోయాయని తెలిపారు. ముఖ్యంగా పామాయిల్, కూరగాయలు, కిరాణా సరుకుల ధరలు పెరిగి సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. వంట గ్యాస్ ధరలు కూడా పెరగడంతో మహిళలు తీవ్ర ఆందోళన చెందుతున్నారని, మధ్యతరగతి కుటుంబాలు కుటుంబ బడ్జెట్ నిర్వహించలేని పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. ప్రజలకు ఊరట కల్పించాల్సిన ప్రభుత్వం ధరల భారం మోపడం దారుణమన్నారు. పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను వెంటనే తగ్గించే వరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున పోరాటాలు కొనసాగిస్తామని విజయానంద రెడ్డి హెచ్చరించారు. ప్రజల సమస్యలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు.
ఈ నిరసన కార్యక్రమంలో పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, మహిళా విభాగ సభ్యులు, యువజన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నిరసన ర్యాలీ కారణంగా చిత్తూరు పట్టణంలో కొంతసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి పరిస్థితిని అదుపులో ఉంచారు.
