కుర్చపల్లికి ఆర్టీసీ బస్సు…
- ఫలించిన సర్పంచ్ చొరవ..
- బైకాని రాజు ప్రత్యేక కృషితో గ్రామానికి రవాణా సౌకర్యం
రఘునాథపల్లి, ఆంధ్రప్రభ : కుర్చపల్లి గ్రామ ప్రజల చిరకాల ఆర్టీసీ బస్సు సమస్యకు ఎట్టకేలకు పరిష్కారం లభించింది. రఘునాథపల్లి మండలం కుర్చపల్లి గ్రామ సర్పంచ్ బైకాని రాజు ప్రత్యేక చొరవతో గ్రామానికి ఆర్టీసీ బస్సు సేవలు అందుబాటులోకి వచ్చాయి.
గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న ప్రయాణ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకున్న సర్పంచ్ బైకాని రాజు.. సంబంధిత అధికారులతో పలుమార్లు చర్చలు జరిపారు. గ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం లేకపోవడంతో విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు, మహిళలు, వృద్ధులు పడుతున్న ఇబ్బందులను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఆయన కృషి ఫలించడంతో హనుమకొండ నుంచి పాలకుర్తి వరకు నడిచే ఆర్టీసీ బస్సును కుర్చపల్లి మీదుగా నడిపేందుకు చర్యలు చేపట్టారు.
బస్సు సేవలు ప్రారంభం కావడంతో గ్రామ ప్రజల్లో హర్షం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా విద్యార్థులు, ఉద్యోగులతో పాటు వివిధ పనుల నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్లే గ్రామస్తుల ప్రయాణ కష్టాలు తీరనున్నాయి. గ్రామానికి ప్రభుత్వ రవాణా సౌకర్యం అందుబాటులోకి రావడం ఎంతో సంతోషంగా ఉందని స్థానికులు పేర్కొన్నారు.
గ్రామ ప్రజల అవసరాలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేస్తున్న సర్పంచ్ బైకాని రాజును గ్రామస్తులు అభినందించారు. కుర్చపల్లికి ఆర్టీసీ బస్సు సేవలు అందుబాటులోకి రావడం గ్రామాభివృద్ధిలో మరో ముందడుగని పేర్కొన్నారు.
