బోల్గట్‌పల్లిలో ప్రీ-ప్రైమరీ పాఠశాల ప్రారంభం

  • ప్రభుత్వ బడుల బలోపేతానికి ప్రీ-ప్రైమరీ విద్యే పునాది
  • మండల విద్యాధికారి శ్రీనివాసమూర్తి

అచ్చంపేట, ఆంధ్రప్రభ : ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రీ-ప్రైమరీ విద్య బలమైన పునాదిగా నిలుస్తుందని మండల విద్యాధికారి శ్రీనివాసమూర్తి అన్నారు. 2026–27 విద్యా సంవత్సరానికి మంజూరైన ప్రీ-ప్రైమరీ పాఠశాలను బుధవారం ఎంపీపీఎస్ బోల్గట్‌పల్లి పాఠశాలలో గ్రామ సర్పంచ్ పార్వతి గోపాల్ నాయక్‌తో కలిసి ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా శ్రీనివాసమూర్తి మాట్లాడుతూ.. చిన్నారులకు ప్రాథమిక దశ నుంచే నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం ప్రీ-ప్రైమరీ పాఠశాలలను ఏర్పాటు చేస్తోందన్నారు. ప్రైవేట్ పాఠశాలలకు పంపుతున్న చిన్నారులను ప్రభుత్వ ప్రీ-ప్రైమరీ పాఠశాలలో చేర్పించేలా గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు కృషి చేయాలని కోరారు. ముఖ్యంగా సర్పంచ్‌తో పాటు గ్రామ పెద్దలు తల్లిదండ్రులకు అవగాహన కల్పించి ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల చేరికలను పెంచేందుకు సహకరించాలని సూచించారు.

అనంతరం అకాడమిక్ ఇన్‌స్ట్రక్టర్, ఆయాలకు చిన్నారుల బోధన, సంరక్షణపై పలు సూచనలు, సలహాలు అందించారు. పాఠశాలలో విద్యార్థుల విద్యా ప్రగతితో పాటు సంబంధిత రికార్డులను పరిశీలించారు. మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును తనిఖీ చేసి, విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని వంట సిబ్బందికి సూచించారు.

ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు శారద, ఉపాధ్యాయులు భాస్కర్, భవాని, శివ, అంగన్‌వాడీ ఉపాధ్యాయులు, గ్రామస్తులు పాల్గొన్నారు.