Nirmal | రైతు కళ్లలో మళ్లీ నీరే!
Nirmal | రైతు కళ్లలో మళ్లీ నీరే!
- అర్ధరాత్రి వర్షానికి తడిసిన ధాన్యం, జొన్నలు
- కల్లాల్లోనే పంటలు నష్టపోవడంతో రైతుల ఆవేదన
- వెంటనే కొనుగోలు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి
నిర్మల్ జిల్లా, కుంటాల మండలం : ఆరుగాలం కష్టపడి పండించిన పంట కళ్లముందే తడిసి ముద్దవుతుంటే రైతు గుండె ఎంత ముక్కలవుతుందో మాటల్లో చెప్పలేం. నిర్మల్ జిల్లా కుంటాల మండలంలో అర్ధరాత్రి కురిసిన భారీ వర్షం రైతుల ఆశలపై నీళ్లు చల్లింది. కల్లాల్లో విక్రయానికి సిద్ధంగా ఉంచిన వరి, జొన్న పంటలు వర్షపు నీటిలో తడిసి భారీ నష్టాన్ని చవిచూశాయి.
ఇప్పటికే పండించిన పంటను సకాలంలో అమ్ముకోలేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు ఈ వర్షం మరింత దెబ్బతీసింది. ఒకవైపు కొత్త సాగు సీజన్ ప్రారంభం కావడంతో విత్తనాలు, ఎరువులు సమకూర్చుకునేందుకు రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమై ఉండగా, మరోవైపు కల్లాల్లో నిల్వ ఉంచిన పంటలు వర్షానికి తడవడంతో తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పంటను పండించేందుకు నెలల తరబడి శ్రమించిన రైతులు, చేతికి డబ్బు వస్తుందన్న ఆశతో కల్లాల్లో నిల్వ చేసిన ధాన్యం, జొన్నలు ఒక్క రాత్రిలోనే తడిసి నాణ్యత కోల్పోవడం వారిని తీవ్రంగా కలచివేసింది. ఇప్పటికే అప్పులు, పెట్టుబడి భారంతో సతమతమవుతున్న రైతులకు ఈ పరిణామం మరింత ఆర్థిక భారం మోపుతోంది.
“పంట పండింది… అమ్ముడైతే అప్పులు తీర్చుకుందామనుకున్నాం. కానీ ప్రకృతి మరోసారి మమ్మల్ని పరీక్షిస్తోంది” అంటూ పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కల్లాల్లో తడిసిన పంటలను చూస్తూ రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు.
ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి, వర్షానికి తడిసిన పంటలను ప్రత్యేకంగా కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే నష్టాన్ని అంచనా వేసి తగిన పరిహారం అందించాలని కోరుతున్నారు.
ప్రకృతి వైపరీత్యాల మధ్య ప్రతి గింజను చెమటతో పండించే రైతుకు ఈ సమయంలో ప్రభుత్వ అండ అత్యవసరమని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. రైతు కష్టానికి తగిన విలువ దక్కాలని, కల్లాల్లో తడిసిన పంటలను వెంటనే కొనుగోలు చేసి ఆదుకోవాలని బాధిత రైతులు వేడుకుంటున్నారు.

