కనకదుర్గమ్మ ఆలయానికి నూతన వైదిక కమిటీ నియామకం….

కనకదుర్గమ్మ ఆలయానికి నూతన వైదిక కమిటీ నియామకం….

ఐదుగురు సభ్యులతో కమిటీ పునర్వ్యవస్థీకరణ
పాత కమిటీ రద్దు చేస్తూ ఈవో శీనా నాయక్ ఉత్తర్వులు
దేవస్థాన వైదిక కార్యక్రమాల పర్యవేక్షణ కమిటీదే బాధ్యత

ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : విజయవాడ లోని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో నూతన వైదిక కమిటీని నియమిస్తూ దేవస్థాన కార్యనిర్వహణాధికారి (ఈవో) శీనా నాయక్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటివరకు కొనసాగుతున్న వైదిక కమిటీని రద్దు చేసి, సరికొత్త కమిటీతో పునర్వ్యవస్థీకరణ చేపట్టారు.

వైదిక కార్యక్రమాలలో…

దేవస్థానంలో నిర్వహించే వివిధ వైదిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ప్రత్యేక పూజలు, ఉత్సవాలు, యాగాలు, వేద సంబంధిత అంశాల నిర్వహణ, పర్యవేక్షణ బాధ్యతలను ఈ నూతన వైదిక కమిటీ నిర్వహించనుంది. ఆలయ సంప్రదాయాలు, ఆగమ శాస్త్ర విధానాలకు అనుగుణంగా కార్యక్రమాలు జరిగేలా కమిటీ మార్గనిర్దేశనం చేయనుంది.

నూతనంగా ఏర్పాటు చేసిన ఐదుగురు సభ్యుల వైదిక కమిటీలో స్థానాచార్యులుగా వి. శివప్రసాద్ శర్మ, వేద పండితులుగా ఎం. షణ్ముఖ శాస్త్రి, ప్రధాన అర్చకులుగా ఎల్. దుర్గాప్రసాద్, ఉప ప్రధాన అర్చకులుగా కె.ఎన్.వి.డి.ఎం. ప్రసాద్ బి. శంకర శాండిల్యలను నియమించారు. దేవస్థానంలో జరిగే అన్ని వైదిక కార్యక్రమాలు ఇకపై ఈ కమిటీ పర్యవేక్షణలో నిర్వహించబడనున్నాయి. ఆలయ ఆధ్యాత్మిక సంప్రదాయాల పరిరక్షణతో పాటు భక్తులకు మరింత శాస్త్రోక్త సేవలు అందించేందుకు ఈ కమిటీ కీలకంగా పనిచేయనున్నట్లు దేవస్థాన వర్గాలు పేర్కొన్నాయి.