పుట్టపర్తిలో ఆధార్ సేవా కేంద్రం ప్రారంభం

పుట్టపర్తిలో ఆధార్ సేవా కేంద్రం ప్రారంభం

జిల్లా ప్రజలకు ఒకేచోట అన్ని ఆధార్ సేవలు అందుబాటులోకి

శ్రీ సత్యసాయి బ్యూరో, ఆంధ్రప్రభ: శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో నూతనంగా ఏర్పాటు చేసిన యూఐడీఏఐ (UIDAI) ఆధార్ సేవా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్, స్థానిక ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ మాట్లాడుతూ, ప్రజలకు ఆధార్‌కు సంబంధించిన అన్ని సేవలను ఒకేచోట వేగవంతంగా, పారదర్శకంగా అందించాలనే లక్ష్యంతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కొత్త ఆధార్ నమోదు, మొబైల్ నంబర్ లింకింగ్, చిరునామా మార్పు, బయోమెట్రిక్ అప్‌డేట్‌లు తదితర సేవలు ఈ కేంద్రంలో అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు.

విజయవాడ, విశాఖపట్నం వంటి ప్రధాన నగరాల్లో లభించే అత్యాధునిక డిజిటల్ సేవలు ఇకపై పుట్టపర్తిలోనే అందుబాటులోకి రావడం జిల్లా ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల ప్రజలు, వృద్ధులు, మహిళలు ఆధార్ సేవల కోసం ఇతర నగరాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఈ కేంద్రం దోహదపడుతుందని వివరించారు.

ఆధార్ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడంలో కృషి చేసిన యూఐడీఏఐ అధికారులు, బీఎల్‌ఎస్ ఇంటర్నేషనల్ ప్రతినిధులను కలెక్టర్ అభినందించారు.

ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి మాట్లాడుతూ, జిల్లా ప్రజలందరూ ఈ కేంద్రం ద్వారా తమ ఆధార్ వివరాలను సకాలంలో నవీకరించుకుని సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆధార్ సేవా కేంద్రం ఏర్పాటుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఆర్డీఓ సువర్ణ, తహశీల్దార్ కళ్యాణ్ చక్రవర్తి, ఆధార్ కేంద్రం సిబ్బంది, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

జిల్లా ప్రజలకు మరింత మెరుగైన, సులభతరమైన డిజిటల్ సేవలను అందించడంలో ఈ ఆధార్ సేవా కేంద్రం కీలక పాత్ర పోషిస్తుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.

Leave a Reply